Champions Trophy 2025 : భారత్ పై ఓటమి.. పాక్ జట్టుపై సునీల్ గవాస్కర్ కామెంట్స్ వైరల్.. ఇమ్రాన్ ఖాన్ ఉంటే అందరినీ..
ప్రస్తుతం పాక్ ఉన్న ఫామ్‌లో భారత బి జట్టును కూడా ఓడించలేదని టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నారు.

Champions Trophy 2025 Sunil Gavaskar brutally slams Pakistan after loss against India
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ కథ ముగిసింది. ఆతిథ్య జట్టు సెమీస్‌కు చేరకుండానే నిష్ర్కమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పాక్ ఆటతీరుపై మండిపడ్డాడు. ఓ ఆంగ్ల మీడియాతో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లు లేరన్నాడు. ప్రస్తుతం పాక్ ఉన్న ఫామ్‌లో ఇండియా బి పై కూడా గెలవడం చాలా కష్టమన్నాడు.
ఒకప్పుడు పాక్ ప్రతిభావంతులైన క్రికెటర్లకు అడ్డగా ఉండేదన్నాడు. కానీ.. ఇప్పుడు ప్రతిభావంతమైన ఆటగాళ్లను తయారు చేయడంలో పాక్ ఘోరంగా విఫలమైందన్నారు. బలమైన రిజర్వ్ ఆటగాళ్లు లేకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
‘టెక్నికల్‌గా అంత పట్టు లేకపోయినా.. ఒకప్పుడు సహజ ప్రతిభ కలిగిన ఆటగాళ్లు పాక్ జట్టులో ఉండేవారు. ఉదాహరణకు ఇంజామామ్ ఉల్ హక్‌ను తీసుకోండి. అతడిలా ఉండాలని మీరు ఏ యువ క్రికెటర్‌కు చెప్పరు. కానీ.. ఇంజామామ్ మంచి టెంపర్‌మెంట్ కలిగి ఆటగాడు.’ అని సునీల్ గవాస్కర్ చెప్పారు.
ప్రస్తుతం ఉన్న జట్టుకు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా ఉంటే.. ఇలాంటి ప్రదర్శలను చేసినందుకు వారిని బ్యాట్‌తో కొట్టేవాడని గవాస్కర్ పేర్కొన్నాడు. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలు ఇలాంటి మ్యాచ్‌ల్లో మధ్య మధ్యలో ఫోర్లు కొడుతూ ఆఖరి ఓవర్లు వచ్చేసరికి సిక్సర్లతో చెలరేగిపోతుంటారు. అప్పట్లో పాక్ ఆటగాడు జావేద్ మియాందాద్ ఇలా చేసేవాడని, అలాంటి ఆటగాళ్లు పాక్ జట్టులో ప్రస్తుతం లేరని అన్నాడు.
పాకిస్తాన్ జట్టులో ప్రస్తుతం కీలక ఆటగాళ్లుగా ఉన్న ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఫఖర్ స్థానంలో వచ్చిన ఇమామ్ ఉల్ హక్ భారత్‌తో మ్యాచ్‌లో 26 బంతుల్లో 10 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. బాబర్ ఆజామ్ (26 బంతుల్లో 23) వేగంగా ఆడే క్రమంలో త్వరగా ఔట్ అయ్యాడు. కెప్టెన్ రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు, సౌద్ షకీల్ 76 బంతుల్లో 62 పరుగులు చేసినప్పటికి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచలేకపోయాడు. పాక్ స్టార్ బ్యాటర్లలో ఎవ్వరి స్ట్రైక్ రేటు కూడా వంద దాటకపోవడం గమనార్హం.