IND vs NZ: రోహిత్ శర్మకు ఏమైంది..? న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైనట్లేనా.. ఓపెనర్‌గా వచ్చేది ఎవరంటే..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మార్చి 2న న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై సందిగ్దత నెలకొంది. ప్రాక్టీస్ సెషన్ లోనూ రోహిత్ పాల్గొనలేదు..

Rohit Sharma
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత జట్టు అదరగొడుతుంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలు సాధించిన టీమిండియా.. మార్చి2న న్యూజిలాండ్ జట్టుతో మ్యాచ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రూప్ -ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్స్ కు వెళ్లాయి. పాయింట్ల పట్టికలో నెట్ రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది. మార్చి2న జరిగే మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్తుంది. అయితే, కివీస్ తో మ్యాచ్ కు ముందు భారత్ ఫ్యాన్స్ ను ఆందోళన కలిగించే అంశం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది.
న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అతను తొడ కండర గాయంతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దుబాయ్ లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. అయితే, ఈ ప్రాక్టీస్ సెషన్ కు రోహిత్ శర్మ గైర్హాజరయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కూడా రోహిత్ తొడ కండర నొప్పితో బాధపడినట్లు కనిపించింది. దీంతో రోహిత్ ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొనలేదని తెలుస్తోంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు చాలా తక్కువని సమాచారం.
కివీస్ తో మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరమైతే వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభమన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. తుది జట్టులో పలుమార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని కూడా కివీస్ తో మ్యాచ్ కు పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా షమీ అసౌకర్యంగా కనిపించాడు. దీంతో అతన్ని పక్కనపెట్టి అర్ష్ దీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కివీస్ తో మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరమైతే.. కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో తుది జట్టులోకి రిషబ్ పంత్ చేరే అవకాశం ఉంది. అతను ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే టీమిండియా సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. దీంతో కివీస్ తో మ్యాచ్ కు రోహిత్ దూరమైన పెద్దగా ఇబ్బంది ఉండదనే భావనలో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. మ్యాచ్ కు మరో మూడు రోజులు సమయం ఉండటంతో రోహిత్ శర్మ గైర్హాజరీ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.