Champions Trophy : ‘నువ్వు అలా చేయాల్సింది కాదు..’ జడేజా పై కివీస్ మాజీ ఆటగాడు తీవ్ర ఆగ్రహం..
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Commentator Simon Doull Blasts Ravindra Jadeja For Unacceptable Act Against New Zealand
దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (79; 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45)లు రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు పడగొట్టాడు. కైల్ జామీసన్, విలియం ఒరూర్కే, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో కేన్ విలియమ్స్‌న్ (81) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. దీంతో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. పాండ్యా, జడేజా, అక్షర్‌లు తలా ఓ వికెట్ తీశారు.
రవీంద్ర జడేజా కివీస్ మాజీ ఆటగాడి ఆగ్రహం..
ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అది కూడా కివీస్ స్టార్ బ్యాటర్ టామ్ లేథమ్ (14) ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 33 ఓవర్‌లో టామ్ లేథమ్‌ను జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. జడేజా విసిరిన బంతిని టామ్ లేథమ్ రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి బ్యాట్‌ను తాకలేదు. నేరుగా ప్యాడ్లను తాకింది. దీంతో జడేజా అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు.
ఈ సమయంలో జడేజా చేసిన పని కివీస్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్‌కు నచ్చలేదు. జడేజా అప్పీల్ చేయడంతో పాటు సెలబ్రేట్ చేసుకునే సమయంలో పిచ్ మధ్యలోకి పరిగెత్తాడని సైమన్ డౌల్ ఆరోపించాడు. ఆ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న డౌల్ దీని ఎత్తి చూపాడు. అంపైర్లు జడేజా వార్నింగ్ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
‘అలా చూడండి.. మీరు (జడేజా) అలా చేసి ఉండకూడదు. హెచ్చరిక వచ్చి ఉండాల్సింది.’ అని డౌల్ అన్నాడు.
కాగా.. సాధారణంగా ఆటగాళ్లు పిచ్ మధ్యలో నడిచినా, పరిగెత్తినా కూడా అంపైర్లు వార్నింగ్ ఇస్తారు. పదే పదే ఓ ఆటగాడు మ్యాచ్ లో కావాలని చేస్తే ఒకటి రెండు సార్లు అంపైర్లు వార్నింగ్ ఇస్తారు. అయినప్పటికి సదరు ప్లేయర్ అలాగే చేస్తే అతడిని ఆ మ్యాచ్ వరకు బౌలింగ్ నుంచి తప్పిస్తారు.
ఇదిలా ఉంటే.. కివీస్ పై విజయం సాధించడంతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. దుబాయ్ వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ జరగనుంది.