Champions Trophy: ఓటమి నుంచి నేర్చుకున్నామంటున్న న్యూజిలాండ్‌.. భారత్‌తో జరిగే ఫైనల్‌ మ్యాచులో గర్జిస్తుందా?

ఓటమి తర్వాత చేసే ప్రయత్నం మరింత ప్రభావవంతంగా ఉంటుందని న్యూజిలాండ్‌ ఫ్యాన్స్‌ కూడా ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Champions Trophy: ఓటమి నుంచి నేర్చుకున్నామంటున్న న్యూజిలాండ్‌.. భారత్‌తో జరిగే ఫైనల్‌ మ్యాచులో గర్జిస్తుందా?

Updated On : March 7, 2025 / 5:09 PM IST

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో దుబాయ్‌లో ఇప్పటికే టీమిండియాతో ఓ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్‌ ఇప్పుడు అదే జట్టుతో ఫైనల్‌ పోరుకు సిద్ధమవుతోంది. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో టీమిండియాపై న్యూజిలాండ్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఆదివారం ఈ ఇరు జట్ల మధ్య దుబాయ్‌లోనే ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. దీంతో తప్పులను సరిద్దుకుని మెరుగ్గా రాణిస్తామని ఆ జట్టు విశ్వాసంతో ఉంది. ఓటమి తర్వాత చేసే ప్రయత్నం మరింత ప్రభావవంతంగా ఉంటుందని న్యూజిలాండ్‌ ఫ్యాన్స్‌ కూడా ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రచిన్ రవీంద్ర తాజాగా ఫైనల్‌ మ్యాచ్‌ గురించి స్పందిస్తూ.. తమ పెర్ఫార్మన్స్‌ గురించి, ఏయే అంశాలను మెరుగుపర్చుకోవాలన్న విషయం గురించి చర్చిస్తామని, తదుపరి మ్యాచ్ కోసం మానసికంగానూ సిద్ధం అవుతామని అన్నాడు.

సెమీఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన న్యూజిలాండ్ మరింత ఉత్సాహంతో ఫైనల్ మ్యాచుకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ క్రికెటర్ విలియమ్సన్ కూడా పైనల్‌లో బాగా రాణిస్తామని అన్నాడు. తమ జట్టు సన్నద్ధంగా ఉంటుందని చెప్పాడు. టీమిండియా గొప్ప జట్టని, బాగా ఆడుతోందని అన్నాడు.

టీమిండియాతో ఆడిన మ్యాచ్‌ నుంచి ఏం గ్రహించామన్నది, దాని ద్వారా ఏం నేర్చుకొన్నామన్నది ముఖ్యమని చెప్పాడు. అలాగే, దుబాయ్‌లో ఎలా ఆడాలన్న విషయంపై భారత్‌కు బాగా అనుభవం ఉందని అన్నాడు. దుబాయ్‌లో భారత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడటంతో ఆ పిచ్‌పై టీమిండియాకు సమగ్రంగా అవగాహన ఉంటుందన్నాడు.

తాము కూడా భారత్‌తో దుబాయ్‌లో మ్యాచ్‌ ఆడామని, దాని నుంచి నేర్చుకుని ఫైనల్ మ్యాచులో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని విలియమ్సన్ చెప్పాడు. న్యూజిలాండ్‌లోని ఇతర ఆటగాళ్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్‌ ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచు కూడా ఓడిపోలేదు. చాలా బలంగా కనపడుతున్న భారత్‌ ఫైనల్‌లోనూ మళ్లీ అదే స్థాయిలో రాణిస్తుందని టీమిండియా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.