తప్పకుండా ఐపీఎల్‌లో ఆడుతా.. ఊహాగానాలపై ధోనీ క్లారిటీ!

  • Publish Date - October 25, 2020 / 04:44 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో, చెన్నై సూపర్ కింగ్స్ సరిగా ఆడకపోవడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓటమి తరువాత, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గురించి, కెప్టెన్ ధోని భవిష్యత్తు గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారంటూ.. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు కూడా ధోనీ ఆడడు అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఊహాగానాలపై ధోనీ స్పందించారు. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను కచ్చితంగా ఆడతాననికెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు.


మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8మ్యాచ్‌లు ఓడిపోగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 6 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక ఉన్న మూడు మ్యాచ్‌లలో చివరి మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా వారు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం మాత్రం లేదు.

ఈ క్రమంలోనే ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌లలో భవిష్యత్ జట్టును సిద్ధం చేయడానికి కృషి చేస్తానని కెప్టెన్ ధోని చెప్పాడు. యువ ఆటగాళ్లను ఆడించేందుకు ఇప్పుడు జట్టుకు మంచి అవకాశం వచ్చిందని ధోని చెప్పాడు. అయితే మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్ తరువాత, ఐపిఎల్‌కు వీడ్కోలు చెబుతారంటూ వస్తున్న ఊహాగానాలపై మాత్రం స్పందించలేదు.


ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత కెప్టెన్ ధోని తన జెర్సీని పాండ్య సోదరులకు బహుమతిగా ఇవ్వడంతో అసలు అనుమానాలు మొదలవగా మొత్తానికి క్లారిటీ వచ్చింది. ఈ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్ తరువాత, ధోనీ తన జెర్సీ లేదా ఆటోగ్రాఫ్‌ను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు, కొత్తగా వస్తున్న యువ ఆటగాళ్లకు ఇస్తున్నాడు.