Amol Muzumdar : భార‌త మ‌హిళా క్రికెట్ విజ‌యాల వెనుక ఒకే ఒక్క‌డు.. క్రికెట‌ర్‌గా అన్‌ల‌క్కీ.. అయితేనేం కోచ్‌గా సూప‌ర్ స‌క్సెస్..

భార‌త జ‌ట్టు ఈ చారిత్ర‌క విజ‌యం సాధించ‌డం వెనుక జ‌ట్టు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ నిస్వార్థ కృషి కూడా ఉంది.

Amol Muzumdar : భార‌త మ‌హిళా క్రికెట్ విజ‌యాల వెనుక ఒకే ఒక్క‌డు.. క్రికెట‌ర్‌గా అన్‌ల‌క్కీ.. అయితేనేం కోచ్‌గా సూప‌ర్ స‌క్సెస్..

Do you know these things about Amol Muzumdar 11000 Runs Who Never Made International Debut

Updated On : November 3, 2025 / 2:41 PM IST

Amol Muzumdar : ఎన్నాళ్లుగానో అంద‌ని ద్రాక్ష‌లాగా ఊరిస్తూ వ‌స్తున్న మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను భార‌త్ ముద్దాడింది. ఈ క్ర‌మంలో అంద‌రి దృష్టి కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన‌ సీనియ‌ర్ ప్లేయ‌ర్లు దీప్తి శ‌ర్మ‌, జెమీమా రోడిగ్స్‌, షెఫాలీ వ‌ర్మ‌ల వంటి వారిపైనే ఉంది. అయితే.. భార‌త జ‌ట్టు ఈ చారిత్ర‌క విజ‌యం సాధించ‌డం వెనుక జ‌ట్టు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ నిస్వార్థ కృషి కూడా ఉంది.

ఎంతో ప్ర‌తిభ అత‌డి సొంతం. దేశ‌వాళీ క్రికెట్‌లో 11 వేల‌కు పైగా ప‌రుగులు సాధించినా కూడా.. ఎన్న‌డూ భార‌త జ‌ట్టు జెర్సీని ధ‌రించే అవ‌కాశం మాత్రం అత‌డికి రాలేదు. అయితేనేం.. కోచ్‌గా భార‌త జ‌ట్టుకు ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించి త‌న పేరును చ‌రిత్ర‌లో లిఖించుకున్నారు.

రమాకాంత్ అచ్రేకర్‌ వద్దే శిక్షణ‌…

భారత దేశవాళీ క్రికెట్‌లో అమోల్ ముజుందార్‌ను అత్యంత స్థిరమైన, ధృఢమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పేర్కొంటారు. స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు అత‌డు కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌ వద్దే శిక్షణ పొందారు. అందుక‌నే అమోల్ ను చాలా మంది జూనియ‌ర్ స‌చిన్ అని పిలిచేశారు. 1993-94 రంజీ ట్రోఫీ సీజ‌న్ అరంగ్రేట మ్యాచ్‌లోనే చ‌రిత్ర సృష్టించాడు.

Smriti Mandhana : అప్పుడే క‌ప్పు తీసుకువెళ్లి బాయ్‌ఫ్రెండ్ చేతిలో పెట్టిన స్మృతి మంధాన.. వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌చ్చేసింది.. ఇక పెళ్లిఎప్పుడంటే..?

ముంబై త‌రుపున బ‌రిలోకి దిగిన అమోల్ హ‌ర్యానాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఏకంగా 260 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ క్ర‌మంలో రంజీ ట్రోఫీ అరంగ్రేటంలోనే అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ రికార్డు దాదాపు 25 సంవ‌త్స‌రాలు పాటు కొన‌సాగింది. అత‌డి సుదీర్ఘ కెరీర్‌లో ముంబై, అస్సాం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 171 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 48.13 స‌గ‌టుతో 11,167 ప‌రుగులు సాధించాడు. ఇందులో 30 శ‌త‌కాలు కూడా ఉన్నాయి.

టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్‌లో స‌చిన్, గంగూలీ, ద్ర‌విడ్‌, ల‌క్ష్మ‌ణ్ వంటి దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఉండ‌డంతో అత‌డికి సీనియ‌ర్ జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.

కోచ్‌గా కెరీర్‌..

2014లో అత‌డు క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ఆ త‌రువాత అత‌డు కోచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అండ‌ర్‌-19, అండ‌ర్‌-23 జ‌ట్ల‌కు మార్గ‌నిర్దేశ‌కుడిగా ప‌ని చేశాడు. ఐపీఎల్‌లో 2018నుంచి 2020 వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాటింగ్ కోచ్‌గా కూడా ప‌ని చేశాడు.

2023 అక్టోబ‌ర్‌లో బీసీసీఐ అత‌డిని భార‌త మ‌హిళా జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా నియ‌మించింది. ఈ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన ముజుందార్‌.. జ‌ట్టును పున‌ర్నిర్మాణం చేసే ప‌నిలో ప‌డ్డాడు. ఆట‌గాళ్ల‌కు కావాల్సినంత స్వేచ్ఛ నిచ్చేవాడు. ఈ క్ర‌మంలో వైఫ‌ల్యాలు ఎదురైన‌ప్ప‌టికి ఆట‌గాళ్ల‌కు అండ‌గా నిలిచేవాడు.

Laura Wolvaardt : అందుకే ఓడిపోయాం.. లేదంటే ప్ర‌పంచ‌క‌ప్ మా చేతుల్లో ఉండేది.. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ కామెంట్స్‌..

ఇదిలా ఉంటే.. మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో టీమ్ఇండియా ప్ర‌యాణం సుల‌భంగా ఏమీ సాగ‌లేదు. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టం చేసుకుంది. అయిన‌ప్ప‌టికి కూడా స‌హ‌నం కోల్పోకుండా జ‌ట్టును స‌రైన రీతీలో పుంజుకునేలా చేశాడు. ఈ క్ర‌మంలోనే సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై చారిత్రక ఛేజింగ్‌ను సాధించి, ఫైనల్‌లో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యం సాధించి తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను భార‌త్ గెలుచుకుంది.