Eng Vs Ind: కోల్పోయింది 9 వికెట్లే.. కానీ ఇంగ్లాండ్ ఆలౌట్.. ఇదెలా సాధ్యం.. కారణం ఏంటి..

Eng Vs Ind: కోల్పోయింది 9 వికెట్లే.. కానీ ఇంగ్లాండ్ ఆలౌట్.. ఇదెలా సాధ్యం.. కారణం ఏంటి..

Updated On : August 2, 2025 / 1:14 AM IST

Eng Vs Ind : భారత్ తో 5వ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు మాత్రమే కోల్పోయింది. మరో వికెట్ మిగిలే ఉంది. అయినప్పటికీ ఆ జట్టు ఆలౌట్ అని డిక్లేర్ అయ్యింది. ఇదెలా సాధ్యం.. అందుకు కారణం ఏంటి.. తెలుసుకుందాం..

2025 అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 5 టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా 23 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్ కేవలం 9 వికెట్లు మాత్రమే కోల్పోయినప్పటికీ ఆలౌట్ అయినట్లు ప్రకటించేశారు అంపైర్లు. అదేంటి.. మరో వికెట్ మిగిలే ఉంది కదా అనే సందేహం రావొచ్చు.

ఆతిథ్య జట్టు బ్యాటింగ్ లో షార్ట్ గా ఉండటానికి కారణం క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు రాకపోవడమే. 36 ఏళ్ల వోక్స్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ ఆలౌట్ అయినట్లు అంపైర్లు ప్రకటించేశారు. క్రిస్ వోక్స్ ను ఆబ్సెంట్ హర్ట్ గా పరిగణించారు. కాగా, బౌండరీ ఆపే ప్రయత్నంలో అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ వోక్స్.. భుజానికి గాయమైంది. 2వ రోజు ఆట ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) ఒక ప్రకటనలో వోక్స్ ఈ మ్యాచ్‌లో ఇక పాల్గొనడని పేర్కొంది.

”భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి రోజు ఎడమ భుజానికి గాయం కావడంతో ఐదవ టెస్ట్‌లో మిగిలిన ఆట అంతా ఇంగ్లాండ్ సీమర్ క్రిస్ వోక్స్ పర్యవేక్షణలో ఉంటాడు. గాయం కారణంగా అతను ఇకపై టెస్ట్‌లో పాల్గొనే అవకాశం లేదు. సిరీస్ ముగింపులో తదుపరి అంచనా వేయబడుతుంది” అని ECB ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లు తమ ప్లేయింగ్ XIలో నాలుగు మార్పులు చేశాయి. భారత బ్యాటర్లలో కరుణ్ నాయర్ తొలి అర్ధ సెంచరీ (57)తో రాణించాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో గాయం తర్వాత సిరీస్‌లో తొలిసారిగా కనిపించిన గస్ అట్కిన్సన్ 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకే ఆలౌట్ అయింది.

దీనికి సమాధానంగా ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌట్ అయి 23 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ (4-86), ప్రసిద్ధ్ కృష్ణ (4-62) అద్భుతంగా రాణించారు. బెన్ డకెట్ (43), జాక్ క్రాలే (64) కేవలం 12.5 ఓవర్లలో 92 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కానీ ఆతిథ్య జట్టు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించిన ఇంగ్లాండ్.. అనూహ్యంగా తక్కువ స్కోరుకే పరిమితమైంది.

Also Read: భార్యతో విడాకులు.. అసలు కారణం ఏంటో చెప్పేసిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్..