Fifa World Cup 2026 : గోల్డెన్ బాల్ నుంచి గోల్డెన్ బూట్, గోల్డెన్ గ్లోవ్ వరకు.. ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేతల పూర్తి జాబితా ఇదే..
Fifa WorldCup Awards Full List : ప్రపంచకప్ ట్రోఫీని గెలవడంతో పాటు వ్యక్తిగత అవార్డుల్లోనూ స్పెయిన్ ఆటగాళ్లు సత్తా చాటారు. గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్, బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డులు స్పెయిన్ ఖాతాలో చేరడం ఆ జట్టు ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచింది.
Fifa WorldCup Golden Boot
Fifa WorldCup Awards Full List : 2026 ఫిఫా ప్రపంచకప్ ఘనంగా ముగిసింది. అమెరికాలో జరిగిన ఈ మెగా టోర్నీలో స్పెయిన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవగా, వ్యక్తిగత విభాగాల్లోనూ పలువురు స్టార్ ఆటగాళ్లు తమ ప్రతిభతో ప్రత్యేక అవార్డులు సొంతం చేసుకున్నారు. జట్టు విజయంతో పాటు వ్యక్తిగత అవార్డుల్లోనూ స్పెయిన్ ఆటగాళ్లు ఆధిపత్యం చాటారు.
గోల్డెన్ బాల్ – రోడ్రీ (స్పెయిన్)..
టోర్నీలో అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బాల్ అవార్డును స్పెయిన్ కెప్టెన్ రోడ్రీ అందుకున్నాడు. మిడ్‌ఫీల్డ్‌లో అద్భుత నియంత్రణ, ఖచ్చితమైన పాసింగ్, జట్టును సమర్థంగా నడిపించిన నాయకత్వంతో స్పెయిన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లోనూ అతని ఆట జట్టుకు ఎంతో బలంగా నిలిచింది.
గోల్డెన్ బూట్ – కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్)..
టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి ఇచ్చే గోల్డెన్ బూట్ అవార్డు ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపెకు దక్కింది. ఫ్రాన్స్ టైటిల్ గెలవకపోయినా, తన అద్భుత గోల్ స్కోరింగ్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 10గోల్స్, నాలుగు అసిస్ట్ లతో ఈ జాబితాలో అగ్రస్థానిలో నిలిచాడు. ఆ తరువాత అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ (8గోల్స్, 4 అసిస్ట్ లు) ఉన్నారు. 2022 వరల్డ్ కప్‌లో గోల్డెన్ బూట్ అవార్డు దక్కించుకున్న ఎంబాపె (8 గోల్స్, 3 అసిస్ట్‌లు) వరుసగా రెండోసారి గోల్డెన్ బూట్‌ను దక్కించుకుని రికార్డు సృష్టించాడు. గోల్డ్ బూట్ బరువు సుమారు ఒక కిలో ఉంటుంది. దీనిని ఇత్తడి మిశ్రమ లోహంతో తయారు చేస్తారు. దానిపై మందపాటి బంగారు పొరను ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు.
గోల్డెన్ గ్లోవ్ – ఉనై సైమన్ (స్పెయిన్)..
టోర్నీలో అత్యుత్తమ గోల్‌కీపర్‌గా స్పెయిన్ కీపర్ ఉనై సైమన్ ఎంపికయ్యాడు. కీలక మ్యాచ్‌లలో అనేక అద్భుత సేవ్‌లు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా ఫైనల్లో అర్జెంటీనా దాడులను అడ్డుకోవడంలో అతని పాత్ర అమోఘం.
బెస్ట్ యంగ్ ప్లేయర్ – పౌ కుబార్సీ (స్పెయిన్)
టోర్నీలో అత్యుత్తమ యువ ఆటగాడిగా స్పెయిన్ డిఫెండర్ పౌ కుబార్సీ అవార్డు అందుకున్నాడు. చిన్న వయసులోనే ఒత్తిడిని తట్టుకుని అద్భుత రక్షణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ ఫుట్‌బాల్ దృష్టిని ఆకర్షించాడు.
ఫెయిర్ ప్లే అవార్డు – జపాన్
మైదానంలో క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి, ప్రత్యర్థుల పట్ల గౌరవం ప్రదర్శించిన జట్టుకు ఇచ్చే ఫిఫా ఫెయిర్ ప్లే అవార్డు ఈసారి జపాన్ జట్టుకు లభించింది.
ప్రపంచకప్ ట్రోఫీని గెలవడంతో పాటు వ్యక్తిగత అవార్డుల్లోనూ స్పెయిన్ ఆటగాళ్లు సత్తా చాటారు. గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్, బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డులు స్పెయిన్ ఖాతాలో చేరడం ఆ జట్టు ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచింది.
2026 ఫిఫా ప్రపంచకప్ అవార్డుల పూర్తి జాబితా
♦ ప్రపంచకప్ విజేత: స్పెయిన్
♦ రన్నరప్: అర్జెంటీనా
♦ గోల్డెన్ బాల్: రోడ్రీ (స్పెయిన్)
♦ గోల్డెన్ బూట్: కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్)
♦ గోల్డెన్ గ్లోవ్: ఉనై సైమన్ (స్పెయిన్)
♦ బెస్ట్ యంగ్ ప్లేయర్: పౌ కుబార్సీ (స్పెయిన్)
♦ ఫెయిర్ ప్లే అవార్డు: జపాన్
