IPL 2023, GT vs DC: ఢిల్లీకి డూ ఆర్ డై.. వ‌రుస‌గా నాలుగో విజ‌యంపై క‌న్నేసిన హార్ధిక్ సేన

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్రమోదీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నుంది.ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు చెరో ఎనిమిది మ్యాచులు ఆడగా గుజ‌రాత్ ఆరు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా కేవ‌లం రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించిన ఢిల్లీ ఆఖరి స్థానంలో ఉంది.

IPL 2023, GT vs DC: ఢిల్లీకి డూ ఆర్ డై.. వ‌రుస‌గా నాలుగో విజ‌యంపై క‌న్నేసిన హార్ధిక్ సేన

GT vs DC

Updated On : May 2, 2023 / 4:29 PM IST

IPL 2023, GT vs DC: ఐపీఎల్‌(IPL)2023లో భాగంగా నేడు మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్రమోదీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) త‌ల‌ప‌డ‌నుంది. ప్ర‌స్తుత సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు చెరో ఎనిమిది మ్యాచులు ఆడగా గుజ‌రాత్ ఆరు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా కేవ‌లం రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించిన ఢిల్లీ ఆఖరి స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవంగా ఉండాలంటే ఢిల్లీ ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిందే.

హ్యాట్రిక్ విజ‌యాల‌తో గుజ‌రాత్ మంచి జోష్‌లో ఉంది. ఢిల్లీ పై కూడా త‌మ విజ‌య‌ప‌రంప‌ర‌ను కంటిన్యూ చేయాల‌ని భావిస్తోంది. వృద్దిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్‌, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్లల‌తో కూడిన బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. వీరితో పాటు విజయ్‌శంక‌ర్ త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్నాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో ఛేద‌న‌ను చాలా తేలిక చేస్తున్నాడు. బౌలింగ్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ, జాషువా లిటిల్‌, నూర్ అహ్మ‌ద్, ర‌షీద్ ఖాన్‌లు ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్నారు.

డేవిడ్ వార్న‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్ మిన‌హా మిగిలిన వారు బ్యాటింగ్‌లో విఫ‌లం అవుతుండ‌డమే ఢిల్లీ ఓట‌ముల‌కు ప్ర‌ధాన కార‌ణం. అయితే.. ఆఖ‌రి మ్యాచ్‌లో మిచెల్ మార్ష్‌, ఫిల్ సాల్ట్‌లు అర్ధ‌శ‌త‌కాల‌తో ఫామ్‌లో వ‌చ్చారు. గుజ‌రాత్ తో మ్యాచ్‌లో కూడా వీరు స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌నీశ్ పాండే, ప్రియ‌మ్ గార్గ్‌, స‌ర్ప‌రాజ్ ఖాన్ లు త‌మ స్థాయికి త‌గ్గ‌ట్లు రాణిస్తే గుజ‌రాత్ కు పోటీ ఇవ్వొచ్చు. ఇషాంత్ శ‌ర్మ‌, అన్రిచ్ నోర్జే, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాద‌వ్ లు భీక‌ర లైన‌ప్ క‌లిగిన గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌ను ఏ మేర‌కు క‌ట్ట‌డి చేస్తారో అన్న‌దానిపై ఢిల్లీ విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

హెడ్ టూ హెడ్ రికార్డులు

ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు జ‌ట్లు రెండు సార్లు ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ గుజ‌రాత్ విజ‌యం సాధించింది.

పిచ్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటర్‌లకు స్వర్గధామం. అయితే.. పేస‌ర్లు కాస్త బౌన్స్‌ను రాబ‌ట్టొచ్చు. దీని వ‌ల్ల ఆరంభ ఓవ‌ర్ల‌లో పేస‌ర్లు కొంత స్వింగ్ బౌలింగ్ చేయొచ్చు.

తుది జ‌ట్ల (అంచ‌నా) :

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్, శుభ్‌మాన్ గిల్

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్(వికెట్ కీప‌ర్‌), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, ప్రియమ్ గార్గ్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్