IPL 2025: అయ్య బాబోయ్.. హార్దిక్ పాండ్యాపై బయోపిక్ తీస్తే..: కైఫ్ ఆసక్తికర కామెంట్స్
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లోనూ పాండ్యా బాదిన రెండు సిక్స్‌లు టీమ్‌కి బాగా ఉపయోగపడ్డాయని కైఫ్ తెలిపారు.

Hardik Pandya
క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై బయోపిక్ తీస్తే అతడు ఎన్నో విమర్శలను అధిగమించి పునరాగమనం చేసిన జర్నీపై ఫోకస్ పెట్టి తీయాలని మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ అన్నారు. గత ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను విడిచిపెట్టి ముంబై ఇండియన్స్‌లో చేరిన విషయం తెలిసిందే.
అనంతరం హార్దిక్ పాండ్యా ముంబై, రోహిత్ శర్మ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ముంబైకి ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ స్థానంలో గత ఏడాది హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించారు. మ్యాచులు జరుగుతున్న వేళ కూడా హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేశారు. అయినప్పటికీ హార్దిక్ ఎక్కడా సహనం కోల్పోకుండా ఆడాడు. విమర్శలు చేసినవారు కూడా చివరకు తనను పొడిగేలా పాండ్యా నడుచుకున్నాడు.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా గురించి కైఫ్ తాజాగా మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా బాధను తనలో తానే దాచుకుంటాడని చెప్పారు. ఎవరు ఏమని వ్యాఖ్యలు చేసినా పాండ్యా ముందుకు వెళ్లాడని తెలిపారు. అద్భుతంగా పునరాగమనం చేశాడని అన్నారు. పాండ్యా అప్పట్లో కొన్ని రోజుల పాటు క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అవమానాలను ఎదుర్కొన్నాడని తెలిపారు.
పాండ్యా గురించి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారని అన్నారు. పాండ్యా మానసిక క్షోభను అనుభవించినప్పటికీ, టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించాడని చెప్పారు. ఫైనల్‌లో సౌతాఫ్రికా బ్యాట్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను క్రీజులో నుంచి వెనుదిరిగేలా చేశాడని అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లోనూ పాండ్యా బాదిన రెండు సిక్స్‌లు టీమ్‌కి బాగా ఉపయోగపడ్డాయని కైఫ్ తెలిపారు. అద్భుతంగా ఆల్‌రౌండర్ ప్రదర్శన చేశాడని చెప్పారు. పాండ్యాపై బయోపిక్ తీయాలని భావిస్తే గత 7 నెలలు అతడి విషయంలో జరిగిన ఘటనలను ఒక ఎత్తుగా, గత ఐపీఎల్ సీజన్‌లో చోటుచేసుకున్న ఘటనలు మరో ఎత్తుగా తీయొచ్చాన్నారు. ప్రస్తుత ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యాతో ప్రత్యర్థి జట్లు జాగ్రత్తగా ఉండాలని కైఫ్ సూచించారు.