IPL 2025: ఆర్ఆర్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సంజు శాంసన్ ఎందుకు తప్పుకున్నాడు.. అసలు విషయం ఏమిటంటే?
ఐపీఎల్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సంజూ శాంసన్ ..

Sanju Samson Riyan Parag
IPL 2025: ఐపీఎల్ -2025 టోర్నీ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, ఐపీఎల్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సంజూ శాంసన్ తాత్కాలికంగా తప్పుకున్నాడు.
Also Read: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతుందా.. ఈ ఐపీఎల్‌లో బౌలర్లకు పండగేనా..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి కీలక అప్ డేట్ వెలువడింది. ఆర్ఆర్ జట్టు కెప్టెన్ గా సంజు శాంసన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అతని స్థానంలో కెప్టెన్ గా రియాన్ పరాగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే, టోర్నీ మొత్తానికి కాదు.. కేవలం తొలి మూడు మ్యాచ్ లకు మాత్రమే. ఈ విషయాన్ని స్వయంగా రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రకటించాడు. అయితే, తొలి మూడు మ్యాచ్ లలో శాంసన్ స్పెషలిస్టు బ్యాటర్ కమ్ ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడనున్నాడు.
ఇంగ్లండ్ తో జరిగిన టీ20 సిరీస్ సమయంలో జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సంజూ శాంసన్ వేలికి గాయమైన విషయం తెలిసిందే. గాయం నుంచి సంజూ పాక్షికంగా కోలుకున్నాడు. కానీ, పూర్తిస్థాయి ఆటగాడిగా ఫిట్ నెస్ సాధించలేదని తెలుస్తోంది. బ్యాటింగ్ చేసేందుకు శాంసన్ కు క్లియరెన్స్ వచ్చింది. కానీ, వికెట్ కీపింగ్ చేసేందుకు బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్ నుంచి ఇంకా అతనికి అనుమతి రాలేదు. శాంసన్ వేళ్లకు మరింత రెస్టు కావాలని ఎక్సలెన్స్ సెంటర్ అభిప్రాయపడింది. దీంతో తొలి మూడు మ్యాచ్ లకు రియాన్ పరాగ్ కు ఆర్ఆర్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
💪 Update: Sanju will be playing our first three games as a batter, with Riyan stepping up to lead the boys in these matches! 💗 pic.twitter.com/FyHTmBp1F5
— Rajasthan Royals (@rajasthanroyals) March 20, 2025
రాజస్థాన్ రాయల్స్ తన తొలి మూడు మ్యాచ్ లలో మార్చి 23వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్, 26వ తేదీన కోల్ కతా, 30వ తేదీన చెన్నై జట్లతో ఆడనుంది. అయితే, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ విషయంలో బీసీసీఐ ఎక్సలెన్స్ నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు సంజూ శాంసన్ స్పెషలిస్టు బ్యాటర్‌గా ఆడుతాడని ఆర్ఆర్ జట్టు యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తిగా ఫిట్ అయిన తర్వాత మళ్లీ సారథిగా శాంసన్ బరిలోకి దిగనున్నాడు. అప్పటి వరకు రియాన్ పరాగ్ ఆర్ఆర్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు. అయితే, కోహ్లీ తరువాత ఐపీఎల్ లో అతి పిన్న వయస్సులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్న ప్లేయర్ గా రియాన్ పరాగ్ నిలవనున్నాడు.