IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతుందా.. ఈ ఐపీఎల్‌లో బౌలర్లకు పండగేనా..?
ఐపీఎల్ -2025 టోర్నీ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. అదే జరిగితే బౌలర్లకు ..

Mohammed Shami
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని జట్లు టోర్నీలో సత్తాచాటేందుకు సంసిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ టోర్నీ అంటేనే సిక్సులు, ఫోర్లతో స్టేడియం మోతమోగిపోతుంది. దీంతో బ్యాటర్ల దూకుడును అడ్డుకోవాలంటే బౌలర్లు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి. ఎక్కువ శాతం మ్యాచ్ లలో బ్యాటర్ల ఆటతీరుపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటుంటాయి. అయితే, ఈ ఐపీఎల్ సీజన్ లో బౌలర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
సలైవా (లాలాజలం)పై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి గతంలో లాలాజలం (ఉమ్మి)ను బంతిపై వాడటం అమల్లో ఉన్నా.. కరోనా మహమ్మారి సమయంలో ఐసీసీ సలైవాపై నిషేధం విధించింది. ఆ తరువాత ఐపీఎల్ లోనూ నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమల్లో లేకపోవటంతోపాటు.. వైరస్ ముప్పు కూడా ఏమీలేకపోవంతో బీసీసీఐ లాలాజలం వినియోగంపై నిషేధాన్ని ఎత్తివేయాలని భావిస్తుంది. ఐపీఎల్ జట్ల కెప్టెన్ల సమావేశంలో ఈ అంశంపై చర్చించి, నిషేధం తొలగింపుపై ఏకాభిప్రాయం వస్తే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
సలైవాపై నిషేధం ఎత్తివేస్తే బౌలర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే.. లాలాజలాన్ని ఉపయోగించి బౌలర్లు బంతిని షైన్ అయ్యేలా చేసి రివర్స్ సింగ్ కు ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా ఎఫెక్టివ్ టెక్నిక్. బంతి పాతబడిన సందర్భంలో బౌలర్లు సలైవాను ఉపయోగించి బంతిని మెరిసేలా చేస్తూ రివర్స్ స్వింగ్ ను రాబట్టే అవకాశం ఉంటుంది. తద్వారా బ్యాటర్లను ఇబ్బందిపెట్టేందుకు, ఔట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. గతంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సలైవా వాడేందుకు అనుమతి ఇవ్వాలని ఐసీసీని కోరాడు. బౌలర్లు సలైవాతో బంతి రివర్స్ స్వింగ్‌కు ప్రయత్నిస్తామని, వెంటనే బ్యాన్ ఎత్తివేయాలని కోరుతున్నామని, రివర్స్ స్వింగ్ ఆటను ఆసక్తికరంగా మారుస్తుందని షమీ తెలిపాడు.
ఐపీఎల్ ప్రస్తుత నిబంధనల ప్రకారం.. బంతిపై లాలాజలం ఉపయోగించినట్లు నిర్ధారణ అయితే మొదటి సారి హెచ్చరికగా ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ కు హెచ్చరిక జారీ చేస్తారు. రెండోసారి అదే ఘటన రిపీట్ అయితే కెప్టెన్ కు రెండో హెచ్చరిక చేస్తారు. మూడోసారి, అంతకంటే ఎక్కువ సందర్భాల్లో ఇదే పనికి పాల్పడితే ఆటగాడికి రూ.10లక్షలు లేదా అతని మ్యాచ్ ఫీజులో 25శాతం జరిమానా విధిస్తారు.