Heinrich Klaasen fined
Heinrich Klaasen: ఐపీఎల్(IPL) 2023లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అసలే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్ కు షాక్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. సన్‌రైజర్స్ కు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించిన హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen)కు జరిమానా విధించారు. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది.
ఏం జరిగిందంటే..?
సన్ రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 19వ ఓవర్‌ను లక్నో బౌలర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతిని అబ్దుల్ సమద్ ఎదుర్కొనగా హై పుల్ టాస్‌గా వెళ్లింది. దీంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని లక్నో కెప్టెన్ ఛాలెంజింగ్ చేశాడు. ఆ బంతిని థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరీ అని ప్రకటించాడు. నడుము పై నుంచి బంతి వెళ్లినట్లు కనిపిస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరీగా ప్రకటించడంతో క్రీజులో ఉన్న సమద్, క్లాసెన్‌తో పాటు అభిమానులను షాక్ కు గురి చేసింది.
ఈ క్రమంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని క్లాసెన్ వ్యతిరేకించాడు. లెగ్ అంపైర్‌తో కాసేపు వాగ్వాదానికి దిగాడు. ఇక అదే సమయంలో సన్‌రైజర్స్ అభిమానులు లక్నో డగౌట్‌పై నట్టులు, మేకులు విసిరారు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు వాగ్వాదానికి దిగడంతో క్లాసెన్ ఐపీఎల్ నిబంధనలు ఉల్లంగించినట్లు తేల్చారు. దీన్ని క్లాసెన్ కూడా అంగీకరించడంతో అతడి మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం జరిమానా విధించారు.
ఈ మ్యాచ్‌లోనే లక్నో ఆటగాడు అమిత్ మిశ్రా సైతం ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2లోని నిబంధనలను ఉల్లంగించాడు. మ్యాచ్ ఎక్విప్‌మెంట్‌పై ప్రతాపం చూపించినందుకు అతడిని మందలించారు.
Virat Kohli: ఇందుకోసమా నేను ఇంతకాలం బాధపడింది.. ఆ సెంచరీ తరువాత విరాట్ భావోద్వేగం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(47; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అబ్దుల్ సమద్(37నాటౌట్; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) లు రాణించారు. అనంతరం లక్ష్యాన్ని లక్నో 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్లలో ప్రేరక్ మన్కడ్ (64నాటౌట్; 45 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆక్టట్టుకోగా నికోలస్ పూరన్( 44నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టాడు.