IND vs AFG : నేటి నుంచే అఫ్గాన్‌తో భారత్ టీ20 సిరీస్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ (IND vs AFG) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది.
IND vs AFG 1st t20 match when and where to watch pitch report
IND vs AFG : కొంత విరామం తరువాత భారత జట్టు మళ్లీ మైదానంలోకి దిగనుంది. అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. నేటి (సెప్టెంబర్ 13 ఆదివారం) నుంచే ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాను ఓ పెద్ద సమస్య వేదిస్తోంది. అదే టీమ్ సెలక్షన్. ఓపెనింగ్‌లో ఎవరిని ఆడించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఓ ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఆడడం ఖాయం కాగా.. మరో ఓపెనర్‌గా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, సీనియర్ ఆటగాడు సంజూ శాంసన్ ల మధ్య గట్టి పోటీ ఉంది. వీరి ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత శ్రేయస్ అయ్యర్, తిలక్ శర్మ ఆడతారు. ఇక గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇస్తున్న ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తితో కలిసి స్పిన్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. అర్ష్‌దీప్‌తో పాటు బుమ్రా కొత్త బంతిని పంచుకుంటాడు.
పిచ్..
సాధారణంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోని పిచ్ కొంచెం మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లకు సహకారాన్ని అందిస్తుంది. కాస్త ఓపికతో ఆడితే బ్యాటర్లు పరుగుల వరద పారించవచ్చు.
హెడ్-టు-హెడ్..
భారత్, అఫ్గానిస్థాన్‌లు ఇప్పటి వరకు 9 టీ20 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో ఏడు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగియగా మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
ఎక్కడచూడొచ్చు అంటే?
భారత కాలమానం ప్రకారం తొలి టీ20 మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్వర్క్ కలిగి ఉంది. ఈ క్రమంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానున్నాయి. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. ఫ్యాన్ కోడ్ యాప్, వెబ్సైట్లో స్ట్రీమింగ్ కానుంది.
