AUS vs IND : మూడో టెస్టు.. చేతులెత్తేస్తున్న బ్యాటర్లు.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమి దిశగా పయణిస్తున్నట్లు కనిపిస్తోంది.

AUS vs IND : మూడో టెస్టు.. చేతులెత్తేస్తున్న బ్యాటర్లు.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

IND vs AUS 3rd test

Updated On : December 16, 2024 / 11:27 AM IST

IND vs AUS 3rd test: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమి దిశగా పయణిస్తున్నట్లు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. అయితే, భారీ పరుగుల లక్ష్య ఛేదనతో క్రీజులోకి వచ్చిన భారత్ బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నారు. ఓపెన్లుగా క్రీజులోకి యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ రాగా.. జైస్వాల్ (4) వెంటనే ఔట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన రెండో బంతికి షార్ట్ మిడ్ వికెట్ లో మిచెల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శుభమన్ గిల్ సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయాడు.

Also Read: IND vs AUS: మూడో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్.. బుమ్రాకు 6 వికెట్లు

శుభ్ మన్ గిల్ (1) మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మూడో స్లిప్ లో మిచెల్ మార్ష్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్ బాటపట్టాడు. దీంతో కేవలం 6 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (3) సైతం చేతులెత్తేశాడు. ఆఫ్ సైడ్ బంతిని కదిలించి మరీ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 22 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయింది. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తరువాత రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. కొద్దిసేపటికే వర్షం ప్రారంభం కావటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. దీంతో లంచ్ బ్రేక్ ను కాస్త ముందుగానే అంపైర్లు ప్రకటించారు. వర్షం ఆగిపోవడంతో మళ్లీ తిరిగి మ్యాచ్ ప్రారంభం కాగా.. రిషబ్ పంత్ (9) ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. ఆ తరువాత మళ్లీ వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియా బ్యాటర్లు హిట్.. మనోళ్లు ఏం చేస్తారో..! గబ్బాలో ముగిసిన రెండోరోజు ఆట

పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో ఆసీస్ బౌలర్లు సూపర్ బౌలింగ్ తో భారత బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబడతారనేది సందేహమే. దీంతో టెస్టు ఓటమి నుంచి బయటపడేందుకు వరుణ దేవుడిపైనే టీమిండియా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. బ్రిస్బేన్ లో వచ్చే రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్షం కారణంగా తొలి రోజు ఆట నిలిచిపోయిన విషయం తెలిసిందే.