IND vs AUS : ఐదో టెస్టుకు ఒక రోజు ముందే జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. మరో ఆటగాడు అరంగ్రేటం.. భారత్‌కు కష్టకాలమే..!
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

IND vs AUS Australia announce playing XI for Sydney Test against India one day before
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఆస్ట్రేలియా తుది జట్టును ప్రకటించింది. కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెల్లడించాడు. స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ స్థానంలో టాస్మానియన్ ఆల్-రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ అరంగ్రేటం చేయనున్నట్లు పేర్కొన్నాడు.
31 ఏళ్ల బ్యూ వెబ్‌స్టర్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడని కమిన్స్ తెలిపాడు. అందుకనే అతడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టుకు ఉపయుక్తంగా మారతాడని తాము భావిస్తున్నట్లు చెప్పాడు. కాగా.. గత షెఫీల్డ్ షీల్డ్‌లో 938 పరుగులతో వెబ్‌స్టర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇటీవలి జరిగిన ఓ వన్డేలో కేవలం 17 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
Gautam Gambhir : ఇక చాలు.. టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ల పై గౌతమ్ గంభీర్ గరం గరం..! ఎక్కువ చేస్తే..
మార్ష్‌ను తప్పించడానికి గల కారణాలను పాట్ కమిన్స్ వివరించాడు. ఈ సిరీస్‌లో అతడు కఠిన దశను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నాడు. నాలుగు టెస్టుల్లో 10.42 సగటుతో 73 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలోనే అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మార్ష్ కూడా అర్థం చేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికి అతడు జట్టుకు కీలక ప్లేయర్ అని కమిన్స్ అన్నాడు.
ICC Test rankings : జస్‌ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు..
బోర్డర్ గవాస్కర్‌లో ట్రోఫీ సిరీస్‌లో మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. తొలి టెస్టులో భారత్ గెలవగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టెస్టు మ్యాచ్ డ్రా కాగా.. నాలుగో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఆసీస్ దూసుకుపోయింది. ఇక సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి మ్యాచులో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆసీస్ భావిస్తోండగా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది.
ఐదో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే..
సామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచ్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బొలాండ్.
JUST IN: Pat Cummins confirms a change to the playing XI for the SCG Test #AUSvIND
— cricket.com.au (@cricketcomau) January 1, 2025