Gautam Gambhir : ఇక చాలు.. టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ల పై గౌతమ్ గంభీర్ గరం గరం..! ఎక్కువ చేస్తే..
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లపై గౌతమ్ గంభీర్ మండిపడినట్లుగా వార్తలు వస్తున్నాయి.

IND vs AUS Gambhir Lashes Out At India Stars and Issues Stern Warning Reports
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోయింది. ఈ ఓటమితో టీమ్ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరుకునేందుకు అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఈ ఓటమితో భారత జట్టు డ్రెస్సింగ్స్ రూమ్ వాతావరణం వేడెక్కింది. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లపై గౌతమ్ గంభీర్ మండిపడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
నాలుగు టెస్టు మ్యాచులో కొంత మంది ప్లేయర్లు పేలవ షాట్లు ఆడి ఔట్ అయ్యారు. దీనిపై గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడట. ఓటమి అనంతరం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చిన వెంటనే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసింది చాలని గంభీర్ అన్నట్లు ఆ వార్తల సారాంశం.
ప్రధాన కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడట. ప్లేయర్ యొక్క శైలి మార్చుకోకుండా ఓ ఆరు నెలల పాటు ఇష్టమైన విధానంలోనే ఆడేందుకు అనుమతి ఇచ్చాడట. అయితే.. మెల్‌బోర్న్ ఓటమితో ఇప్పుడది ముగిసిందని కొందరు అంటున్నారు. ఇక ఇప్పటి నుంచి మాత్రం జట్టు వ్యూహాలకు అనుగుణంగా ఆడని వారిపై వేటు పడడం తథ్యం అని గంభీర్ సంకేతాలు ఇచ్చాడట. జట్టు సమావేశంలో రచించిన వ్యూహాలకు అనుగుణంగా మైదానంలో ఆటగాళ్లు ఆడడం లేదని, దీనిపైనే ప్రధానంగా చర్చజరిగిందట.
మెల్‌బోర్న్ టెస్టులో రిషబ్ పంత్ బాధ్యతారాహిత్యంగా తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. పంత్ ఔట్ కావడంతో మ్యాచ్ గమనం మొత్తం మారిపోయింది. ఇక ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ పదే పదే ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడుతూ ఔట్ అవుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏ స్థానంలో (ఆరో స్థానంలో, ఓపెనర్‌గా) వచ్చినా కూడా రాణించలేదు. ఇలా సీనియర్లు ఆడుతున్న తీరు పట్ల గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతీప్తితో ఉన్నట్లు ఆంగ్ల మీడియోలో వార్తలు వస్తున్నాయి.
Team India : కొత్త ఏడాది ప్రారంభంలోనే టీమ్ఇండియా అభిమానులకు భారీ షాక్ తగలనుందా?
గౌతమ్ గౌంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత టీమ్ఇండియా ప్రదర్శన పడిపోయింది. శ్రీలంకలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ వైట్ వాష్ కావడం, ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో గంభీర్ ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తోంది. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జనవరి 3 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే గంభీర్‌కు కష్టాలు తప్పవని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతడిని టెస్టు కోచింగ్ నుంచి తప్పించవచ్చుననే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.