IND vs BAN 1st Test : శ‌త‌క్కొట్టిన అశ్విన్‌, జ‌డేజా హాఫ్ సెంచ‌రీ.. తొలి రోజే 330 దాటిన భార‌త స్కోరు

చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచులో భార‌త్ దుమ్మురేపింది.

IND vs BAN 1st Test : శ‌త‌క్కొట్టిన అశ్విన్‌, జ‌డేజా హాఫ్ సెంచ‌రీ.. తొలి రోజే 330 దాటిన భార‌త స్కోరు

IND vs BAN

Updated On : September 19, 2024 / 5:11 PM IST

చెపాక్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచులో భార‌త్ దుమ్మురేపింది. స్పిన్ ఆల్‌రౌండ‌ర్లు.. అశ్విన్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా, ర‌వీంద్ర జ‌డేజా హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. ఫ‌లితంగా తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 339 ప‌రుగులు చేసింది. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (102 నాటౌట్‌ ; 112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ), ర‌వీంద్ర జ‌డేజా (86 నాటౌట్ ; 117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు క్రీజులో ఉన్నారు.

ఆరంభం పేల‌వం..

చెపాక్ పిచ్ ఫాస్ట్ బౌల‌ర్ల‌కు అనుకూలిస్తుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లా కెపెన్ అంచ‌నాల‌ను నిజం చేస్తూ.. యువ పేస‌ర్‌ హ‌సన్ మహమూద్ చెల‌రేగిపోయాడు. భార‌త బ్యాట‌ర్ల‌కు చుక్కులు చూపించాడు. కెప్టెన్‌, ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 6 ప‌రుగుల‌కే ఔట్ కాగా.. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన శుభ్‌మ‌న్ గిల్ డ‌కౌట్ అయ్యాడు.

AFG vs SA : 17/1, 24/2, 25/3, 29/4, 29/5, 36/6, 36/7.. వామ్మో ఏంటిది సౌతాఫ్రికా..

చాలా కాలం త‌ర‌వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆదుకుంటాడు అనుకుంటే అత‌డు కూడా 6 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ మూడు వికెట్లు కూడా హ‌స‌న్‌కే ద‌క్కాయి. దీంతో భార‌త్ 34 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఆదుకున్న జైస్వాల్‌-పంత్..

ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి మ‌రో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ క్రీజులో పాతుకు పోయాడు. అత‌డికి రిష‌బ్ పంత్ (39 52 బంతుల్లో 6 ఫోర్లు) జ‌త క‌లిశాడు. ఓ వైపు జైస్వాల్ వికెట్లు ప‌డ‌కుండా జాగ్ర‌త్త ఆడుతుంటే మ‌రోవైపు పంత్ మాత్రం బంగ్లా బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. అటు జైస్వాల్ సైతం వీలు చిక్కిన‌ప్ప‌డ‌ల్లా బౌండ‌రీలు కొట్టాడు. లంచ్ త‌రువాత కాసేప‌టికే హ‌స‌న్ మ‌హ‌మూద్ బౌలింగ్‌లో లిట‌న్ దాస్ క్యాచ్ అందుకోవ‌డంతో పంత్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. పంత్‌-జైస్వాల్ జోడి నాలుగో వికెట్‌కు 62 ప‌రుగులు జోడించారు. కాసేప‌టికే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌తో పాటు కేఎల్ రాహుల్ (16) స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. దీంతో భార‌త్ 144 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

అశ్విన్‌-జ‌డేజా ధ‌నాధ‌న్‌..

ఈ ద‌శ‌లో క్రీజులోకి వ‌చ్చిన స్పిన్ ఆల్‌రౌండ‌ర్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజాలు జ‌ట్టును ఆదుకున్నారు. ఎదురుదాడే ల‌క్ష్యంగా వీరిద్దరు బ్యాటింగ్ చేశారు. తొలుత అశ్విన్, ఆ త‌రువాత జ‌డేజా బంగ్లా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. పోటాపోటీగా బౌండ‌రీలు బాదుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు. వ‌న్డే త‌ర‌హాలో వీరిద్ద‌రి బ్యాటింగ్ సాగింది. దాదాపు ఐదు నుంచి ఆరు ర‌న్‌రేట్‌తో బ్యాటింగ్ చేశారు. ముందుగా అశ్విన్‌, ఆ త‌రువాత జ‌డేజా హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు.

IPL 2025 : ఐపీఎల్ 2025 మెగా వేలానికి డేట్‌ ఫిక్స్‌!.. ఫ్రాంచైజీల‌కు బీసీసీఐ డెడ్‌లైన్ టెన్ష‌న్‌?

అర్ధ‌శ‌త‌కాలు పూర్తి చేసుకున్న త‌రువాత వీరి దూకుడు త‌గ్గ‌లేదు స‌రిక‌దా మ‌రింత‌గా పెంచారు. ఈ క్ర‌మంలో అశ్విన్ 108 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో అత‌డికి ఇది అత‌డికి ఆరో సెంచ‌రీ. మ‌రో వైపు జ‌డేజా సైతం శ‌త‌కానికి చేరువ‌య్యాడు. వీరిద్ద‌రు అజేధ్య‌మైన ఏడో వికెట్‌కు 227 బంతుల్లోనే 195 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.