IND vs ENG 5th t20 : అభిషేక్ శర్మ శతక్కొట్టుడు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం.. ఎంతంటే?
అభిషేక్ శర్మ చెలరేగడంతో ఇంగ్లాండ్ ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది.

IND vs ENG Abhishek Sharma century helps india 247 in 5th t20
టీమ్ఇండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. దీంతో ముంబై వేదికగా జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. అభిషేక్ తో పాటు శివమ్ దూబె (30;13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 ;15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ఇండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు తీశాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జేమి ఓవర్టన్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లో సంజూ శాంసన్ (16; 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) రెండు సిక్సర్లు బాది మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే.. రెండో ఆఖరి బంతికి మార్క్ వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఓ ఫోర్, రెండు సిక్సర్లు బాది తన ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పాడు అభిషేక్ శర్మ.
Innings Break!
A smashing batting performance fro #TeamIndia 🔥🔥
Abhishek Sharma’s incredible TON powers his side to 247/9 👏👏
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/B13UlBNdFP#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/XnwdD4N23T
— BCCI (@BCCI) February 2, 2025
ఎడా పెడా బౌండరీలతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 17 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. ఆ తరువాత విధ్వంసం పతాక స్థాయికి చేరింది. మరోవైపు తిలక్ వర్మ అతడికి చక్కని సహకారం అందించాడు. ఈ క్రమంలో పవర్ ప్లే పూర్తి అయ్యే సరికి భారత్ 95-1తో నిలిచింది. టీ20ల్లో పవర్ ప్లేలో భారత జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. వేగంగా ఆడే క్రమంలో కార్సే బౌలింగ్‌లో తిలక్ ఔట్ అయ్యాడు. తిలక్, అబిషేక్ శర్మ జోడి రెండో వికెట్‌కు 115 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొంది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2) విఫలం అయ్యాడు. అయినప్పటికి ఐదో స్థానంలో బరిలోకి దిగిన శివమ్ దూబె సహకారంతో అభిషేక్ విలయతాండవం చేశాడు. ఈ క్రమంలో అభిషేక్ 37 బంతుల్లో సెంచరీ చేశాడు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. సెంచరీ తరువాత మరింత ధాటిగా ఆడే క్రమంలో ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ క్యాచ్ అందుకోవడంతో అభిషేక్ విధ్వంసానికి తెరపడింది.
మరోవైపు దూబె ఔట్ అయిన తరువాత వచ్చిన పాండ్యా (6), రింకూ సింగ్ (9)లతో పాటు అక్షర్ పటేల్ (15) లు విఫలం కావడంతో టీమ్ఇండియా 250 స్కోరు దాటలేకపోయింది.