IND vs SA 1st Test Day 2 : 11 ప‌రుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా.. ముగిసిన రెండో రోజు ఆట‌..

సెంచూరియ‌న్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు మొద‌టి టెస్టు మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి

IND vs SA 1st Test Day 2 : 11 ప‌రుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా.. ముగిసిన రెండో రోజు ఆట‌..

IND vs SA 1st Test Day 2

Updated On : December 27, 2023 / 9:16 PM IST

ముగిసిన రెండో రోజు ఆట‌..
సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమితో మ‌రో 21 ఓవ‌ర్ల ఆట మిగిలి ఉండగానే అంపైర్లు ఆట‌ను ఆపేశారు. ద‌క్షిణాఫ్రికా 66 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 256 ప‌రుగులు చేసింది. డీన్ ఎల్గ‌ర్ (140), మార్కొజాన్సెన్ (3)లు క్రీజులో ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, బుమ్రాలు చెరో రెండు వికెట్లు తీశారు. ప్ర‌సిద్ధ్ కృష్ణ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా 11 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. భార‌త మొద‌టి ఇన్నింగ్స్‌లో 245 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

కైల్ వెరినే ఔట్‌..
ప్ర‌సిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవ‌డంతో కైల్‌వెరినే(4) ఔట్ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా 249 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. డీన్ ఎల్గ‌ర్ (137) ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

హాఫ్ సెంచ‌రీ త‌రువాత బెడింగ్‌హమ్ ఔట్‌..
ప్ర‌సిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో సింగిల్ తీసి 80 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న డేవిడ్ బెడింగ్‌హమ్ (56) మ‌రికాసేప‌టికే సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా 244 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

డీన్ ఎల్గ‌ర్ సెంచ‌రీ..
ద‌క్షిణాఫ్రికా ఓపెన‌ర్ డీన్ ఎల్గ‌ర్ సెంచ‌రీ చేశాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 49 ఓవ‌ర్ల‌కు సౌతాఫ్రికా స్కోరు 194 3. డీన్ ఎల్గ‌ర్ (115), బెడింగ్‌హమ్ (32) లు ఆడుతున్నారు.

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు తీసిన బుమ్రా..
బుమ్రా త‌న వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీశాడు. ముద‌ట‌గా టోనీ డి జోర్జిని(28) ఔట్ చేసిన అత‌డు ఆ త‌రువాత కీగన్ పీటర్సన్ (2) క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 113 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది.

డీన్ ఎల్గ‌ర్ హాఫ్ సెంచ‌రీ..
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి డీన్ ఎల‌ర్గ‌ర్ 79 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 23 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 84/1. ఎల్గ‌ర్ (50), టోనీ డి జోర్జి (23) లు క్రీజులో ఉన్నారు.

మార్‌క్ర‌మ్ ఔట్‌..
మొద‌టి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ద‌క్షిణాఫ్రికాకు భార‌త బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ షాకిచ్చాడు. ఓపెన‌ర్ మార్‌క్ర‌మ్ (5) సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా 11 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

టీమ్ఇండియా 245
సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 245 ప‌రుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (101; 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగాడు. విరాట్ కోహ్లీ (38), శ్రేయ‌స్ అయ్య‌ర్ (31)లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో క‌గిసొ ర‌బాడ ఐదు వికెట్లు తీశాడు. నాండ్రీ బర్గర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్కొ జాన్సెన్‌, గెరాల్డ్ కోయెట్జీ లు చెరో వికెట్ సాధించారు.

కేఎల్ రాహుల్ సెంచరీ..
ఓ వైపు వికెట్లు ప‌డ‌తున్నా నిల‌క‌డ‌గా ఆడిన కేఎల్ రాహుల్ 133 బంతుల్లో శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. గెరాల్డ్ వేసిన 66వ ఓవ‌ర్‌లో సిక్స్ కొట్టి సెంచ‌రీని అందుకున్నాడు.

ఆట ప్రారంభం..
వ‌రుణుడు తెరిపినివ్వ‌డంతో ఎట్ట‌కేల‌కు మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఓవ‌ర్‌నైట్ స్కోరు 208/8 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భార‌త్ 245 పరుగులకు ఆలౌటైంది.

మ‌ళ్లీ వ‌ర్షం..
వ‌ర్షం కార‌ణంగా మొద‌టి రోజు ఆట‌లో 31 ఓవ‌ర్లు న‌ష్ట‌పోవ‌డంతో రెండో రోజు మ్యాచ్‌ను అర‌గంట ముందుగా అంటే ఒంటి గంట‌కే ప్రారంభించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. అయితే.. రెండో రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు వ‌ర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభం కానుంది. తొలి రోజు టీమ్ఇండియా 59 ఓవర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 208 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (70), సిరాజ్‌(0)లు క్రీజులో ఉన్నారు.