Vaibhav Suryavanshi: ఇదేం బాదుడు భయ్యా.. 32 బంతుల్లోనే సెంచరీ.. మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్..

ప్రత్యర్థి జట్టు బౌలర్లను చితక్కొట్టాడు వైభవ్. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.

Vaibhav Suryavanshi: ఇదేం బాదుడు భయ్యా.. 32 బంతుల్లోనే సెంచరీ.. మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్..

Courtesy @ ESPN Cricinfo

Updated On : November 14, 2025 / 7:20 PM IST

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. సెన్సేషనల్ బ్యాటింగ్ కు కేరాఫ్ గా నిలుస్తున్నాడు. ఇప్పటికే అతడి విధ్వంసకర బ్యాటింగ్ చూశాం. క్రీజులోకి వచ్చాడంటే పరుగుల సునామీ పారిస్తాడు. బౌండరీల వర్షం కురిపిస్తాడు. తాజాగా మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ తో దుమ్మురేపాడీ యువ సంచలనం. జస్ట్ 32 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ విస్మయానికి గురి చేశాడు.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా ఇండియా -ఎ, యూఏఈ తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ఇండియా ఎ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన ఈ14 ఏళ్ల కుర్రాడు.. మరో 16 బంతుల్లో సెంచరీ అందుకోవడం విశేషం.

ప్రత్యర్థి జట్టు బౌలర్లను చితక్కొట్టాడు వైభవ్. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 32 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. టీ20 ఫార్మాట్ లో అతడికిది రెండో సెంచరీ.

క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడాడు. ఆయాన్ ఖాన్‌ వేసిన 3వ ఓవర్‌లో వరుసగా 4, 6, 6 బాదాడు. రోహిద్ ఖాన్ వేసిన 6వ ఓవర్‌లో 2 ఫోర్లు కొట్టడం ద్వారా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ఓ ఓవర్ లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాది 98 పరుగులకు చేరుకున్నాడు. అర్ఫాన్ వేసిన 10వ ఓవర్‌లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కాగా 12.3 ఓవర్ లో ఫరాజుద్దీన్‌ బౌలింగ్‌లో అహ్మద్‌ తారిక్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ సూర్యవంశీ ఔటయ్యాడు. మొత్తం 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో ఇండియా ఎ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Also Read: వ‌సీమ్ అక్ర‌మ్, క‌పిల్ దేవ్, వ‌కార్ యూనిస్, జ‌హీర్ ఖాన్ రికార్డులు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా..