IND vs USA : ఓ ప్రత్యేక అతిథి చేతుల మీదుగా బెస్ట్ ఫీల్డర్ అవార్డు.. ఇచ్చింది ఎవరు..? అందుకుంది ఎవరంటే..?
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది.

IND vs USA Special Guest Gives Away Best Fielder Medal To Star India Pacer
IND vs USA : టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి సూపర్ 8లో చోటు దక్కించుకుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డును అందజేశారు. పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ అవార్డును అందుకోగా.. దీనిని అతడికి ఓ ప్రత్యేక అతిథి అందించాడు.
టీమ్ఇండియా మాజీ ఆటగాడు, టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న యువరాజ్ సింగ్ అమెరికాతో మ్యాచ్ అనంతరం భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. ఆటగాళ్లతో కాసేపు మాట్లాడాడు. నాలుగు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ తో పాటు బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబెలను అభినందించాడు.
ఇక బెస్ట్ ఫీల్డర్ అవార్డు కోసం సిరాజ్‌తో పాటు రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లు నామినేట్ అయినట్లుగా ఫీల్డింగ్ కోచ్ ప్రకటించాడు. కాగా.. బౌండరీ లైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న సిరాజ్‌కు ఈ అవార్డును వరించినట్లు చెప్పాడు. యువరాజ్ సింగ్ బెస్ట్ ఫీల్డర్ అవార్డును సిరాజ్‌కు అందజేశాడు.
భారత జట్టు గ్రూపు దశలో తన చివరి మ్యాచ్‌ను కెనడాతో ఆడనుంది. ఫ్లోరిడా వేదికగా జూన్ 15న ఈ మ్యాచ్ జరగనుంది. అయితే.. ప్రస్తుతం ఫ్లోరిడాలో భారీ వర్షలు పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించడంతో ఎమర్జెన్సీ ని విధించారు. మరో నాలుగు రోజులు పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. భారత్-కెనడా మధ్య మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందిగ్దం నెలకొంది. కాగా.. ఈ మ్యాచ్ భారత్‌కు నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఫలితంతో పెద్దగా సంబంధం లేదు.
View this post on Instagram