ICC AWARDS 2024 : ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ జస్ప్రీత్ బుమ్రా..
సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డును అందుకోవడం నాకు నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు నాకు చాలా ముఖ్యమైనది.

ICC AWARDS 2024 Jasprit Bumrah (Photo Credit : Google)
ICC AWARDS 2024 : ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గెలుచుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. ఐసీసీ అవార్డ్స్ 2024కు సంబంధించి ప్రకటన విడుదలైంది. ఒక క్యాలెండర్ ఇయర్ లో అన్ని అంతర్జాతీయ ఫార్మాట్‌లలో అత్యుత్తమ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన నామినీలలో బుమ్రా విజేతగా నిలిచాడు.
2024లో వెస్టిండీస్, యూఎస్ఏ లో జరిగిన పురుషుల T20 ప్రపంచ కప్‌లో బుమ్రా సత్తా చాటాడు. టెస్ట్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు.
31 ఏళ్ల బుమ్రా బంతితో అదగొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఏకంగా 71 వికెట్లు తీశాడు. అదీ కేవల 14.92 సగటుతో. బుమ్రా కెరీర్ లో ఇదే బెస్ట్. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులలో బుమ్రా నిప్పులు చెరిగాడు. టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. మెన్స్ టీ20 వరల్డ్ కప్ లోనూ అత్యుతమ ప్రదర్శన కనబరిచాడు. 15 వికెట్లు పడగొట్టాడు. అదీ 8.26 యావరేజ్ తో. ఆ టోర్నమెంట్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్న్ మెంట్ నెగ్గిన రెండో బౌలర్ గా ఘనత సాధించాడు.
Also Read : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లపై సునీల్ గవాస్కర్ సీరియస్..
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్ ద్వయం హ్యారీ బ్రూక్, జో రూట్ ను వెనక్కి నెట్టి మరీ సోబర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు బుమ్రా. 2018లో ఈ అవార్డ్ ని విరాట్ కోహ్లీ గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆ పురస్కారం దక్కించుకున్న భారత క్రికెటర్ గా బుమ్రా ఘనత సాధించాడు.
విరాట్ కోహ్లి (2018), రవిచంద్రన్ అశ్విన్ (2016), రాహుల్ ద్రవిడ్ (2004) సరసన బుమ్రా కూడా చేరాడు. ఒకే ఏడాదిలో రెండు పురస్కారాలు.. సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ దక్కించుకున్నారు.
పురస్కారం దక్కడంపై బుమ్రా స్పందించాడు. సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డును అందుకోవడం నాకు నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు నాకు చాలా ముఖ్యమైనది. నా కుటుంబానికి, నా సహచరులకు కృతజ్ఞతలు. నా దృష్టి అంతా మరింత రాణించడం, జట్టుకి మరిన్ని విజయాలు అందించడంపైనే ఉంటుంది.
2024 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. బార్బడోస్‌లో జరిగిన ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2024ను గెలుచుకోవడం మరువలేనిది. గేమ్‌లోని మూడు ఫార్మాట్‌లలో నేను చేయగలిగినంత చేశాను. నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ.. హార్డ్ వర్క్ చేసే వారికి ఆ అవార్డును అంకితం చేస్తున్నా.
Also Read : టీ20ల్లో ధోని రికార్డును బ్రేక్ చేసిన దినేశ్ కార్తీక్.. పరుగుల వీరుడు..
30 డిసెంబర్ 2024 నుంచి 10 జనవరి 2025 మధ్య 12 రోజుల ఓటింగ్ నిర్వహించారు. icc-cricket.comలో 1.5 మిలియన్లకు పైగా ఓట్లను నమోదు చేసుకున్నారు. ICC ఓటింగ్ అకాడమీ, గ్లోబల్ ఫ్యాన్స్.. 12 వ్యక్తిగత విభాగాల్లో విజేతలను నిర్ణయించారు.