సింధు మళ్లీ చిత్తు : డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు

  • Published By: madhu ,Published On : October 18, 2019 / 03:54 AM IST
సింధు మళ్లీ చిత్తు : డెన్మార్క్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు

Updated On : October 18, 2019 / 3:54 AM IST

ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు మళ్లీ ఓడిపోయింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌ సూపర్ 750 ఈవెంట్‌లో భారత్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్ ఐదో సీడ్‌గా బరిలోకి దిగింది సింధు. ఈమె.. అన్ సె యంగ్ (కొరియా)తో తలపడింది. కానీ..రెండో రౌండ్‌లో పరాజయం చవి చూసింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆమె 14-21, 17-21తో ఓడిపోయింది. 17 ఏళ్ల యంగ్..సుదీర్ఘ ర్యాలీలతో అదరగొట్టింది. సింధుకు స్మాష్‌లు కొట్టే ఛాన్స్ ఇవ్వలేదు. షటిల్‌‌ను తక్కువ ఎత్తులో ఉండేలా జాగ్రత్త పడింది.

తొలి గేమ్‌లో పూర్తిగా యంగ్‌దే అధిపత్యంగా ఉంది. సింధు షటిల్‌పై నియంత్రణ కోల్పోవడంతో 21-14తో తొలి గేమ్ యంగ్ సొంతమైంది. రెండో గేమ్ 11-9తో సింధు ఆధిక్యం సంపాదించింది. యంగ్ వరుసగా 4 పాయింట్లతో సింధును ఆత్మరక్షణలోకి నెట్టివేసింది. బలమైన బాడీలైన్ రిటర్న్‌తో సింధు ఆశలపై యంగ్ నీళ్లు చల్లింది. 21-17తో రెండో గేమ్‌ని, మ్యాచ్‌ను యంగ్ కైవసం చేసుకుంది. తనస్థాయికి తగిన ఆటతీరును కనబర్చలేకపోయిందని క్రీడా నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆగస్టులో ప్రపంచ ఛాంపియన్ అయ్యాక..చైనా ఓపెన్‌లో రెండో రౌండ్‌లో, కొరియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లో ఓటమి చెందింది. 

అక్టోబర్ 17వ తేదీ గురువారం భారత క్రీడాకారులకు కలిసి రాలేదు. ప్రతి ఈవెంట్‌లో పరాజయం చవి చూశారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భమిడిపాటి సాయి ప్రణీత్..6-21, 14-21తో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 12-21, 10-21తో ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ షెట్టిలు 16-21, 15-21తో ఆరో సీడ్ హన్ చెంగ్ కయ్ – జౌ హో డాంగ్ (చైనా) జంట చేతిలో ఓడారు. మిక్స్ డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కిరెడ్డి – ప్రణవ్ చోప్రా జోడికి కూడా నిరాశే ఎదురైంది. సైనా, శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 
Read More : భారత్-బంగ్లా మ్యాచ్ కి మోడీ,హసీనా