IML 2025: అదేంకొట్టుడు సామీ..! సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ వీడియో చూశారా.. ఆ షాట్స్‌కు ఫిదా అవ్వాల్సిందే..
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML-2025) విజేతగా ఇండియా మాస్టర్స్ జట్టు నిలిచింది.

Sachin Tendulkar
IND vs WI Final: భారత క్రికెట్ జట్టు ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, తాజాగా భారత జట్టు మరో టోర్నీని గెలుచుకుంది. మాజీ క్రికెటర్లతో నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేతగా భారత్ జట్టు నిలిచింది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ జట్టు వెస్టిండీస్ మాస్టర్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ జట్టు ఘన విజయం సాధించింది. తద్వారా టోర్నీ విజేతగా నిలిచింది.
Also Read: IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్.. టోర్నీ నుంచి కీలక ప్లేయర్ ఔట్
తొలుత వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (45) పరుగులు చేశాడు. అయితే, బ్రయాన్ లారా (6) స్వల్ప పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా మాస్టర్స్ జట్టు 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసి విజేతగా నిలిచింది.
ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (75), సచిన్ టెండూల్కర్ (25) దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి 67 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యువరాజ్ సింగ్ (13నాటౌట్), స్టువర్ట్ బిన్నీ (16నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి ఇండియా మాస్టర్స్ జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఇదిలాఉంటే.. ఈ మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొట్టిన షాట్స్ చూపరులను కట్టిపడేశాయి. సచిన్ కొట్టిన అప్పర్ కట్ షాట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి చాలాకాలం అవుతున్నా సచిన్ బ్యాటింగ్ పవర్ ఏమాత్రం తగ్గలేదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు.. సచిన్ ఐపీఎల్ టోర్నీలో ఉండిఉంటే బౌలర్లకు చుక్కలు కనిపించేవి.. ఆ విషయంలో బౌలర్లు అదృష్టవంతులు అంటూ పేర్కొన్నారు.
THE SACHIN TENDULKAR UPPER CUT. 🥶 pic.twitter.com/UdWvVRHUes
— Johns. (@CricCrazyJohns) March 16, 2025