Vraun Chakravarthy: టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆడలేడా..? ఎందుకో తెలుసా..
మార్చి 22 నుంచి ఐపీఎల్ -2025 టోర్నీ ప్రారంభం కానుంది. వరుణ్ చక్రవర్తి కేకేఆర్ జట్టు..

Vraun Chakravarthy
Vraun Chakravarthy: టీమిండియా జట్టులో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక ప్లేయర్ గా మారిపోయాడు. ఇటీవల ముగిసిన ఛాంపియన్ ట్రోఫీలో ఈ స్పిన్నర్ మూడు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు పడగొట్టి, భారత జట్టు టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతేకాదు.. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ తరువాత అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. అయితే, ఇటీవల అతను ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
Also Read: నాకు బెదింపు కాల్స్ వచ్చాయి.. ఇండియాకు రావద్దని హెచ్చరించారు: టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు భారతదేశం తరపున ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, రాబోయేకాలంలో టెస్ట్ క్రికెట్ అడలేనని, అందుకు కారణాన్ని వెల్లడించాడు. ‘‘నాకు టెస్టు క్రికెట్ ఆడాలని ఎంతో ఆసక్తి ఉంది. కానీ, నా బౌలింగ్ శైలి టెస్టు క్రికెట్ కు సరిపోలడం లేదు. ఎందుకంటే.. నా బౌలింగ్ యాక్షన్ మీడియం పేస్ బౌలర్ లానే ఉంటుంది. టెస్టు క్రికెట్ లో నిరంతరం 20 నుంచి 30 ఓవర్లు బౌలింగ్ చేయాలి. నేను అలా చేయగలనని అనుకోవటం లేదు. నేను ఫాస్ట్ స్పిన్ బౌలింగ్ చేస్తాను కాబట్టి.. నేను గరిష్ఠంగా పది నుంచి పదిహేను ఓవర్లు బౌలింగ్ చేయగలను. కానీ, రెడ్ బాల్ క్రికెట్ కు ఇది సరిపోదు. ఇక్కడ మీరు ప్రతిరోజూ 20 నుంచి 30 ఓవర్లు బౌలింగ్ చేయాలి’’ అని వరుణ్ పేర్కొన్నారు.
వాస్తవానికి వరుణ్ చక్రవర్తి గతంలో ఫాస్ట్ బౌలింగ్ చేసేవాడు. కానీ, 2017 సంవత్సరంలో అతని మోకాలికి గాయమైంది. ఆ గాయం నుంచి కోలుకున్న తరువాత అతను స్పిన్ బౌలింగ్ ప్రారంభించాడు. అయితే, ఈ విషయంపై వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘నేను ఫాస్ట్ బౌలింగ్ ను కొనసాగించి ఉంటే నా కెరీర్ అక్కడే నిలిచిపోయేది. నిజానికి, తమిళనాడు పిచ్ లపై బంతి ఎక్కువగా స్వింగ్ అవ్వదు. స్పిన్నర్లకు ఎక్కువ సహకారం లభిస్తుంది. తమిళనాడు నుంచి చాలా తక్కువ మంది ఫాస్ట్ బౌలర్లు ఉద్భవించడానికి ఇదే కారణం అంటూ వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు.
ఇదిలాఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్ -2025 టోర్నీ ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ ఐపీఎల్ లో వరుణ్ చక్రవర్తి కేకేఆర్ జట్టు తరపున బరిలోకి దిగుతున్నాడు.