టీమిండియా కెప్టెన్‌కు గాయం.. లండన్‌లోని వైద్యుల సమక్షంలో చికిత్స.. అవసరమైతే శస్త్రచికిత్స చేసే అవకాశం..

జూన్ 20 నుంచి భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

టీమిండియా కెప్టెన్‌కు గాయం.. లండన్‌లోని వైద్యుల సమక్షంలో చికిత్స.. అవసరమైతే శస్త్రచికిత్స చేసే అవకాశం..

Teamindia captain

Updated On : June 19, 2025 / 7:41 AM IST

Suryakumar Yadav : జూన్ 20 నుంచి భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు సుధీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించడంతో శుభ్‌మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలో భార‌త్ బ‌రిలోకి దిగ‌నుంది. ఇదే సమయంలో భారత జట్టు టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చికిత్స కోసం ఇంగ్లాండ్ కు బయలుదేరాడు.

 

సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా సంబంధిత గాయం చికిత్స కోసం నిపుణులైన వైద్యుడిని సంప్రదించేందుకు లండన్ వెళ్లారు. అతను శస్త్రచికిత్స చేయించుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడిన సూర్యకుమార్ యాదవ్.. బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. అతను 16 మ్యాచ్‌లలో 65.18 సగటుతో 167.9 స్ట్రైక్ రేట్‌తో 717 పరుగులు సాధించగలిగాడు. విశేషం ఏమిటంటే.. అతని మొత్తం 16 ఇన్నింగ్స్ లలో 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించి, వరుసగా అత్యధికంగా 25 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డులను నెలకొల్పాడు. ఐపీఎల్ ముగిసిన తరువాత సూర్య ముంబై టీ20 లీగ్‌లోనూ ఆడాడు.

సూర్యకుమార్ యాదవ్ గత మూడు నెలలుగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. ఐపీఎల్ లో నిరంతరం ప్రయాణం చేయడం వల్ల అతని నొప్పి తీవ్రమైంది. దీంతో చికిత్స కోసం ఇంగ్లాండ్ కు వెళ్లారు. అవసరమైతే, శస్త్రచికిత్స చేయించుకునేందుకు సూర్య సిద్ధమైనట్లు తెలిసింది.

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. టీమిండియా రాబోయే రెండు నెలల పాటు ఎలాంటి టీ20 మ్యాచ్ లు, సిరీస్ లు ఆడాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ తన గాయానికి చికిత్స పొందగలిగితే మంచి సమయం ఉందని, చికిత్స తరువాత కోలుకోవడానికి, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించడానికి తగినంత సమయం దొరుకుతుందని బీసీసీ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

 

ఆగస్టు చివరిలో భారత్ టీ20 సిరీస్..
శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ చేరుకుంది. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన ఆగస్టు 4న ముగుస్తుంది. దీని తరువాత వారు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటానికి బంగ్లాదేశ్ లో పర్యటించాలి. అక్కడ మొదట మూడు వన్డేలు భారత్ ఆడాల్సి ఉంది. ఆ తరువాత మూడు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. వన్డే సిరీస్ మ్యాచ్ లు ఆగస్టు 17, 20, 23 తేదీల్లో జరగనుండగా.. టీ20 సిరీస్ మ్యాచ్ లు ఆగస్టు 26, 29, 31 తేదీల్లో జరుగుతాయి.