India vs Australia 2020 : కంగారూల నేలపై తొలి పోరులో చతికిలబడ్డ టీమిండియా.. మరో సమరానికి సిద్ధమవుతోంది. టెస్టు చరిత్రలో అవమానకర ఓటమిని మూటగట్టుకున్న భారత జట్టు.. ఆ పరాభవాన్ని పక్కనపెట్టి బదులు తీర్చుకునేందుకు తహతహలాడుతోంది. విరాట్ గైర్హాజరీ, షమీ గాయం, రోహిత్ అందుబాటులో లేకపోవడం.. ఇలా అనేక సవాళ్ల మధ్య రహానే సేన మెల్‌బోర్న్‌లో రెండో టెస్టు బరిలో దిగనుంది. అడిలైడ్ విజయంతో ఆత్మవిశ్వాసంలో ఉన్న ఆసీస్‌ను.. అదును చూసి దెబ్బకొట్టేందుకు టీమిండియా వ్యూహాలకు పదును పెంచింది.
రెండో టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పేసర్ షమీ జట్టుకు దూరం అయ్యాడు. అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించ ఉండగా..పుజారా వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ పృథ్వీ షా స్థానంలో శుబ్ మాన్ గిల్ ను తీసుకున్నారు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్‌లను జట్టులోకి తీసుకున్నారు.
టీమ్ ఇండియా : అజింక్య రహానే (కెప్టెన్), శుబ్‌మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజరా (వైస్ కెప్టెన్), హనుమా విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, బస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఫ్లడ్‌లైట్ల వెలుతురులో అద్భుతాలు చేయలేకపోయిన టీమిండియా.. మెల్‌బోర్న్‌లో సిరీస్ సమం చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇరు జట్ల మధ్య 2020, డిసెంబర్ 26వ తేదీ శనివారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాధ్యతలతో జట్టును విడగా.. అతడి స్థానంలో కూల్ అండ్ కామ్ రహానే సారథ్య బాధ్యతలు మోయనున్నాడు. విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోకపోతే భారత జట్టు మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదు.
నెట్ ప్రాక్టీస్‌కు ముందు భారత జట్టు సభ్యులంతా మల్లయుద్ధాన్ని తలపించే ఎక్సర్‌సైజ్‌లు చేశారు. ఆ తర్వాత స్టాండిన్ కెప్టెన్ రహానే, పుజారా నెట్స్‌లో నటరాజన్ యార్కర్లను ఎదుర్కొన్నారు. రాహుల్, పంత్ కూడా సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మరోవైపు ఆసీస్ ఆటగాళ్లు కూడా మైదానంలో చెమట చిందించారు. రెండో టెస్టుకు జట్టులో ఎలాంటి మార్పు చేయడం లేదని, అడిలైడ్‌లో ఆడిన వారితోనే బరిలో దిగుతామని ఆసీస్ కోచ్ లాంగర్ పేర్కొన్నాడు.