భారత్‌ – ఆసీస్‌ రెండో వన్డే, విజయమే లక్ష్యం

  • Published By: madhu ,Published On : November 29, 2020 / 08:19 AM IST
భారత్‌ – ఆసీస్‌ రెండో వన్డే,  విజయమే లక్ష్యం

Updated On : November 29, 2020 / 9:43 AM IST

India vs Australia 2nd ODI : ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన భారత్.. రెండో ఫైట్‌కు సిద్ధమైంది. అయితే సిరీస్‌ రేసులో నిలవాలంటే 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన తప్పక విజయం సాధించాలి. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు రెండో మ్యాచ్‌లో రిపీట్ కాకూడదని మెన్‌ ఇన్ బ్లూ జట్టు గేమ్ ప్లాన్ సిద్ధం చేసింది. తొలి మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోవడం, ఫీల్డిండ్ మిస్టేక్స్, బ్యాటింగ్‌లో లోపాలతో జట్టు పరాజయం పాలైంది. ఈ లోపాలను అధిగమించి విక్టరీ కొట్టాలని కోహ్లీసేన భావిస్తోంది. తొలి వన్డే ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్.. తన జోరును కొనసాగించాలని ఆస్ట్రేలియా భావిస్తున్నాయి.



బ్యాటింగ్‌ లైనప్‌లో స్ట్రాంగ్‌గా కనిపిస్తున్న భారత్‌కు రెండో మ్యాచ్‌లో ఓపెనర్ అగర్వాల్, శ్రేయాస్, రాహుల్, కెప్టెన్ కోహ్లీ రాణించాల్సి ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో సైని, చాహల్‌ కలిసి 20 ఓవర్లలో 172 పరుగులు ఇచ్చారు. అయితే చాహల్ తన స్పెల్ ముగిసిన తర్వాత గాయంతో మైదానాన్ని వీడాడు. సైని వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వారిద్దరు రెండో మ్యాచ్‌కు ఫిట్‌నెస్‌ సాధించకపోతే శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి వస్తారు. మరో పేసర్ నటరాజన్‌ జట్టులో ఉన్నప్పటికీ బ్యాటింగ్‌ కూడా చేయగలిగే శార్దూల్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.



అయితే సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆసీస్ టాప్‌ ఆర్డర్‌ ఫించ్‌, వార్నర్‌, స్మిత్‌ను భారత బౌలింగ్‌ దళం కట్టడి చేస్తేనే భారత్‌ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆసీస్ బౌలింగ్‌లో కూడా పదును పెరగడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.