IND vs AUS : ఆశలన్నీ వారిద్దరిపైనే.. ముగిసిన మూడోరోజు ఆట.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా మూడోరోజు (సోమవారం) ఆట ముగిసింది.

IND vs AUS : ఆశలన్నీ వారిద్దరిపైనే.. ముగిసిన మూడోరోజు ఆట.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

Rohit Sharma

Updated On : December 16, 2024 / 1:36 PM IST

IND vs AUS 3rd Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో మూడోరోజు ఆట ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ కు పలు దఫాలుగా వర్షం ఆటంకం కలిగించింది. దీంతో పూర్తిస్థాయిలో మ్యాచ్ జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇదిలాఉంటే.. 405 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో సోమవారం ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. అలెక్సీ, మిచెల్ స్టార్క్ క్రీజులోకి వచ్చారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకు బుమ్రా అద్భుత బౌలింగ్ తో మిచెల్ స్టార్క్ (18) ను ఔట్ చేశాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన నాథన్ లైయన్ తో కలిసి అలెక్స్ కేరీ దుకుడుగా ఆడాడు. నాథన్ లైయన్ (2) ను సిరాజ్ బౌల్డ్ చేయగా.. కొద్దిసేపటికే అలెక్స్ కేరీ(70) ఔట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 445 పరుగులు ముగిసింది.

 

వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్..
భారీ టార్గెట్ లక్ష్యఛేదనలో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఆదిలోనే వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులోకి రాగా.. జైస్వాల్ (4) మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శుభమన్ గిల్ (1) కొద్దిసేపటికే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (3) కూడా వెంటనే ఔట్ అయ్యాడు. దీంతో కేవలం 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ జట్టు పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయింది. లంచ్ సెషన్ తరువాత కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వికెట్ పడకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పాట్ కమిన్స్ బౌలింగ్ రిషబ్ పంత్ (9) పెవిలియన్ బాటపట్టాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ (30 నాటౌట్), రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు.

 

ఆ ఇద్దరిపైనే ఆశలు..
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా పైచేయి సాధించాలంటే ఇంకా 394 పరుగులు చేయాల్సి ఉంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. వీరిద్దరిపైనే భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ పరుగులు రాబడితే టీమిండియా ఓటమి నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు వరుణుడిపైనా టీమిండియా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. మూడోరోజు ఆటలోనూ పలు దఫాలుగా వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. మంగళ, బుధవారంసైతం గబ్బాలో వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.