Team India: తలరాత మారని టీం ఇండియా.. ఐసీసీ ట్రోఫీల్లో మళ్లీ అదే కథ.. ఎందుకు ఇలా?
స్వదేశీ, విదేశీ పిచ్‌లపై అద్భుత ప్రదర్శన కనబరిచే టీం ఇండియాకు.. ఐసీసీ ట్రోఫీ ఫోబియా పట్టుకుందా? దిగ్గజ జట్లను మట్టికరిపించిన చరిత్ర ఉన్నా.. ప్రపంచ కప్ పోటీల్లో ఎందుకు ప్రతిభ చూపలేకపోతోందో?

India vs Australia WTC Final
Team India – WTC Final 2023 : టీం ఇండియా తలరాత మారలేదు. ఓవెల్ (The Oval)లో భంగపాటు తప్పలేదు. ప్రపంచ దేశాల్లో సత్తాచాటుతున్న మెన్ ఇన్ బ్లూ (men in blue).. ప్రపంచ వేదికలపై మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. అభిమానులను ఉసూరుమనిపిస్తున్నారు. పేపర్‌పై భారీ సైజులో కనిపించే దిగ్గజ క్రికెటర్లు (legendary cricket players).. ఫీల్డ్‌లో మాత్రం బొక్కబోర్లా పడుతున్నారు. టాప్ ఆర్డర్ (top order) అంతా క్యూకట్టుని.. ఒకరి వెంట ఒకరు పెవీలియన్ (pavilion) బాట పడుతున్నారు. ఈ ఓటమి ఇప్పటిది కాదు.. ఐసీసీ మ్యాచ్‌లు అన్నింటిలోనూ ఇదే తీరు. టీం ఇండియా ఐసీసీ ట్రోఫీ (ICC Trophy) గెలిచి దశాబ్ద కాలం అయింది. ప్రపంచ దేశాలపై ముఖాముఖి జరిగే పోరులో సత్తా చాటే టీం ఇండియాకు ఐసీసీ ట్రోఫీ అచ్చిరావడం లేదా? అంతగా ప్రయారిటీ ఇవ్వడం లేదా?
ప్రపంచ వేదికలపై తడబాటు
హిట్‌మాన్ రోహిత్ (Rohit Sharma), రికార్డుల రారాజు కోహ్లీ(Kohli).. ది వాల్ రహానే (Rahane).. విధ్వంసకర ఆటగాడు గిల్.. ఓహో చెప్పుకుంటూపోతే ఒక్కోక్కరు దిగ్గజాలే.. లిస్టు చూస్తే కప్ గ్యారెంటీ. ఆరివీర భయంకరమైన బ్యాటింగ్‌లైప్.. ప్రత్యర్థులకు చుక్కలే అనుకుంటారు ఎవరైనా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిపోయిన జట్టు టాప్ ఆర్డర్ కూడా ఇదే.. లిస్టులో మన బ్యాట్స్‌మన్‌లను చూస్తే.. వామ్మో ఎంత ప్రమాదకర జట్టో అనుకుంటారు.. కానీ.. చివరికి చూస్తే పెద్ద సున్నాయే కనిపిస్తోంది. ఘోరాతి ఘోరమైన ఓటమే ఎదురవుతోంది. స్వదేశీ, విదేశీ మ్యాచ్‌ల్లో తిరుగులేని ప్రదర్శనలు ఇస్తున్న టీం ఇండియా.. ప్రపంచ వేదికలపై ఆశించిన ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోతోంది. దాదాపు పదేళ్ల నుంచి ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో ఓటమి సాధారణమైపోయింది.

Rohit Sharma WTC Final 2023 (Photo: @BCCI)
రోహిత్‌శర్మ విఫలం
కెప్టెన్‌గా రోహిత్‌శర్మే కరెక్ట్. రానున్న ఐదేళ్లలో వరుసగా ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఉన్నాయి. విక్టరీ కెప్టెన్‌గా రోహిత్ మన దేశానికి మరో ప్రపంచ కప్ తెస్తాడనే నమ్మకం ఉంది.. ఇవి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి అన్నమాటలు. కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకున్నాక.. రోహిత్‌శర్మకు బాధ్యతలు అప్పగించే సమయంలో రోహిత్‌శర్మపై ఎన్నో ఆశలు పెట్టుకుంది జట్టు యాజమాన్యం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌శర్మ.. ఆ జట్టు ఫైనల్స్‌కు వెళ్లిన ప్రతిసారి గెలిపించాడు. ఈ కారణంతోనే రోహిత్‌ను కెప్టెన్‌గా చేయాలని భావించింది బీసీసీఐ. కెప్టెన్‌గా రోహిత్‌శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కానీ.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో మాత్రం చేతులెత్తేశాడు.
Also Read: వన్డే ప్రపంచ కప్ కంటే ముందు టీమిండియా ఏయే టోర్నీల్లో పాల్గొంటుందో తెలుసా?
డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండుసార్లూ ఓటమే
ఎప్పుడో 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది టీమ్‌ఇండియా. అంతకు రెండేళ్ల ముందు వన్డే ప్రపంచకప్, దానికి నాలుగేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్ కూడా భారత్ సొంతమయ్యాయి. కానీ గత దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తోంది. ఈ పదేళ్ల కాలంలో నాలుగు టీ20, రెండు వన్డే ప్రపంచకప్‌ల్లో భారత్‌కు భంగపాటే ఎదురైంది. టెస్టుల్లో అయినా ఐసీసీ ట్రోఫీ అందుతుందేమోనని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పుడూ టీం ఇండియా పేలవ ప్రదర్శనతో మరోసారి నిరాశ పరిచింది. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించినా.. రెండుసార్లూ ఓటమే మూటగట్టుకోవాల్సివచ్చింది.
Also Read: కోహ్లితో గొడవ.. తొలిసారి స్పందించిన గౌతమ్ గంభీర్.. నవీన్ తప్పేమీ లేదట
అసలు సమరంలో మాత్రం..
ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీం ఇండియాదే పైచేయి. ముఖ్యంగా సొంత గడ్డపై సిరీస్ జరిగితే.. మనోళ్లను మించిన మగోళ్లే ఉండరు.. అన్నంత స్థాయిలో రెచ్చిపోతారు. భీకర ఫామ్‌తో మన దేశంలో అడుగు పెట్టన జట్లకు గర్వభంగం చేసి పంపిస్తారు. విదేశాల్లో కూడా ఇలాంటి విజయాలు సాధిస్తూ టీం ఇండియా వరల్డ్‌వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఐసీసీ ట్రోఫీలు అంటే మాత్రం చేతులెత్తేస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి న్యూజిలాండ్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఫైనల్స్‌లో తలపడింది మన జట్టే. ఫైనల్స్ చేరే వరకు చూపించిన ఆధిపత్యం.. అసలు సమరంలో మాత్రం కనిపించడం లేదు. భారత్ రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడానికి, తుది పోరులో ఓటమికి ఎన్నో కారణాలు చెబుతున్నారు. పిచ్‌లు, సుదీర్ఘంగా జరిగిన ఐపీఎల్, వాతావరణం వంటివెన్నో చెబుతున్నారు. కారణాలు ఏవైనా ఓటమి మాత్రం ఆనవాయితీగా మారింది. ఇదే భారత అభిమానులను కలవరపెడుతోంది.
టీం ఇండియాకు.. ఐసీసీ ట్రోఫీ ఫోబియా పట్టుకుందా?.. వివరాలకు ఈ వీడియో చూడండి..