పాక్ బ్యాట్స్‌మన్‌ను కొట్టి.. మనసులు గెలుచుకున్న భారత ఫేసర్

పాక్ బ్యాట్స్‌మన్‌ను కొట్టి.. మనసులు గెలుచుకున్న భారత ఫేసర్

Updated On : February 4, 2020 / 2:08 PM IST

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే సీనియర్ క్రికెట్లో ఫుల్ క్రేజ్. ఇప్పుడు అండర్-19లోనూ అదే హవా కనిపిస్తోంది. కారణం సెమీ ఫైనల్ కావడమే. హోరాహోరీగా పోరాటం ఉంటుందని భావించిన గేమ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ.. 172పరుగులకే కట్టడి చేసింది. పొచెఫ్‌స్ట్రూమ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది.

భారత ఫేసర్ సుషాంత్ మిశ్రా.. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ హైదర్ అలీకి బౌలింగ్ వేసే క్రమంలో బంతి బలంగా తగిలింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ జరుగుతుంది. సుషాంత్ బౌలింగ్‌లో హైదర్ అలీ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. అతను వేసిన బాల్ ఎడమ భుజానికి తగిలి కుప్పకూలాడు. బంతిని తప్పించుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో దెబ్బ గట్టిగానే తగిలింది. 

సుషాంత్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ హైదర్ అలీ దగ్గరకు వెళ్లి అంతా ఓకే కదా అని అడిగి పరామర్శించాడు. ఫిజియో దగ్గర్లో లేకపోవడంతో కాసేపటి వరకూ బ్యాట్స్‌మన్ విలవిలలాడాడు. ఈ ఘటనతో సుషాంత్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడంటూ నెటిజన్లు అతనిపై పొగడ్తలు కురిపిస్తున్నారు. హైదర్ అలీ 77బంతుల్లో 56 పరుగులు చేసి చక్కటి ఇన్నింగ్స్ కనబరిచాడు. 

ఇంతకుముందు పాకిస్తాన్.. భారత్‌లు అండర్-19వరల్డ్ కప్‍‌లో 9సార్లు తలపడ్డాయి. అందులో 5సార్లు భారత్‌దే విజయం. 2006 టోర్నీ ఫైనల్‌లో పాక్-భారత్‌ల పోరు భీకరంగా జరిగింది.