ముగిసిన నాల్గో రోజు ఆట : రోహిత్ మరో సెంచరీ : దక్షిణాఫ్రికా విజయానికి 384 పరుగులు

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది.

  • Publish Date - October 5, 2019 / 01:13 PM IST

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది.

మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా శనివారం (అక్టోబర్ 5, 2019) నాల్గో రోజు ఆటలో కూడా ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్ నుంచి దూకుడుగా ఆడుతూ భారీ స్కోరు రాబట్టింది. భారత రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (149 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్) 127 సెంచరీ నమోదు చేయగా.. చతేశ్వర పుజారా (148 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్) 81 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రవీంద్ర జడేజా (40)తో ఆకట్టుకోగా.. విరాట్ కోహ్లీ (31 నాటౌట్ ) అజింక్య రహానె (27 నాటౌట్), మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (7)పరుగులతో పర్వాలేదనిపించారు. 

మూడో రోజు ఆటలో సౌతాఫ్రికా 118ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆట ఆరంభించిన ప్రొటీస్ 131.2 ఓవర్లలో 431 పరుగులకే కుప్పకూలింది. ఫాలో ఆన్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించి.. 67 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది.

టెస్టుల్లో సెంచరీల ఓపెనర్ : రోహిత్ రికార్డుల మోత
తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో (176) సెంచరీ బాదిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా మరో సెంచరీ (127) నమోదు చేసి రికార్డు సృష్టించాడు. ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు సాధించిన తొలి ఓపెనర్‌గా రోహిత్ అరుదైన ఘనతను సాధించాడు. రెండు ఇన్నింగ్స్ లు కలిపి రోహిత్ మొత్తం 9 సిక్స్ లు బాది అత్యంత సిక్సులు బాదిన ఆటగాడిగా ద్రవిడ్, నవజ్యోత్ సింగ్ ల రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాకు 395 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్ రెండు వికెట్లు, ఫిలాండర్, రబడా తలో వికెట్ తీసుకున్నారు. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. 

తొలుత ఓపెనర్లుగా అడెన్ మార్కమ్ (3), ఎల్గర్ (2) క్రీజులోకి రాగా.. ఆదిలోనే ప్రోటీస్ తొలి వికెట్ కోల్పోయింది. రవీంద్ర  జడేజా బౌలింగ్ లో ఎల్గర్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మార్కమ్ కు జతగా బ్రయాన్ (5)పరుగులతో క్రీజులో ఉన్నారు. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. దీంతో పర్యాటక జట్టు ప్రోటీస్ విజయానికి 384 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో జడేజా ఒక వికెట్ తీసుకున్నాడు.