టీమిండియాను ఆశీర్వదించిన బామ్మ ఇకలేరు

  • Publish Date - January 16, 2020 / 08:11 AM IST

సోషల్ మీడియాలో ఒక్క రోజులో ఫేమస్ అయిన బామ్మ టీమిండియా ‘సూపర్‌ ఫ్యాన్‌’ చారులత (87) కన్నుమూశారు. జనవరి 13న ఈ బామ్మ చనిపోయినట్లు కుటుంబం వెల్లడించింది. ఆమెకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌ ‘క్రికెట్‌ దాదీ’ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ సమయంలో చక్రాల కుర్చీలో వచ్చి టీమిండియాను ఆశీర్వదించిన ఈ బామ్మ అప్పుడు దిగిన ఫోటోతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. 

స్టేడియంలో సందడి చేస్తూ ఎంతో హడివుడి చేసిన ఈ బామ్మ 87ఏళ్ల వయస్సులో కూడా ఎంతో సందడి చేసింది.  ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్లో ఆమె సందడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే మ్యాచ్‌ ముగిసిన తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆమెను కలిశారు. ఆప్యాయంగా పలకరించి ఆశీర్వాదాలు అందుకున్నారు. మిగతా మ్యాచులు చూసేందుకు టికెట్లు కొనిస్తానని కోహ్లీ చెప్పాడు. ఇదంతా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అయితే ఆ బామ్మ జనవరి 13, సాయంత్రం 5:30 గంటలకు తుదిశ్వాస విడిచారని భారమైన హృదయంతో చెబుతున్నాను అంటూ క్రికెట్‌ దాదీ ఇన్‌స్టా పోస్టులో వెల్లడించారు. బీసీసీఐ సైతం చారులత మరణం గురించి తెలిసి సంతాపం వ్యక్తం చేసింది. ‘టీమిండియా సూపర్‌ ఫ్యాన్‌ చారులత పటేల్‌ ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతారంటూ ట్వీట్‌ చేసింది.