ప్రపంచకప్‌కు అడుగు దూరంలో ఆగిన రోజు.. భారత జెర్సీలో ధోని కనిపించి ఏడాది

జూలై 10, 2019… 130కోట్ల భారతీయులు ఆసక్తిగా టీవీల ముందు కూర్చున్న రోజు.. ఇదే రోజు.. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన రోజు ఈరోజే. దీంతో భారత జట్టు టోర్నమెంట్‌కు దూరం అయ్యింది. కోట్లాది మంది అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సెమీ-ఫైనల్స్‌లో కివీస్ ముందు చతికిలపడింది.
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుని భారత్‌కు 240 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. అయితే వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఇది రిజర్వ్ డేలో తర్వాత రోజు పూర్తయింది.
మొత్తం ప్రపంచ కప్‌లో అధ్భుతంగా బ్యాటింగ్ చేసిన భారత జట్టులోని టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లను న్యూజిలాండ్ బౌలర్లు అలవోకగా పెవిలియన్ పంపేశారు. భారత జట్టులో సిరీస్ మొత్తం అధ్భుతంగా రాణించిన రోహిత్ శర్మ ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అవగా.. అందరూ వెంటవెంటనే అవుటయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. తర్వాత హార్దిక్ పాండ్యా కొంతసేపు క్రీజులో ఉన్నాడు. పాండ్యా కూడా 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ విధంగా భారత్ 100 పరుగుల వ్యవధిలో 6 వికెట్లను కోల్పోయింది.
ఆ సమయంలో బాధ్యత మొత్తం మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జెడేజా భుజాలపై పడింది. ఇద్దరు ఆటగాళ్ళు ఒత్తిడితో కూడిన పరిస్థితిలో భారత ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ముందుకు సాగించారు. జడేజా క్రీజులో అడుగు పెట్టిన వెంటనే, న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడడం ప్రారంభించాడు. మరో చివర ధోని స్ట్రైకింగ్ ఇస్తున్నాడు. ధోని, జడేజా వ్యూహం పనిచేసింది. మ్యాచ్లో భారత జట్టు తిరిగి మంచి పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో దురదృష్టవశాత్తు జడేజా బోల్ట్ బంతికి పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో 77 పరుగులకే అవుటయ్యాడు. ఈ వికెట్‌తో భారత జట్టు మరోసారి ఒత్తిడిలోకి పడింది.
అవుట్ అయ్యే ముందు, జడేజా ధోనితో 116 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు, కానీ మార్టిన్ గుప్టిల్ అద్భుతమైన త్రో చెయ్యడంతో ధోని(50) రనౌట్ అయ్యాడు. అంతే భారత జట్టుకు అతిపెద్ద షాక్. దీంతో భారత జట్టు ఆశలన్నీ ఆవిరైపోయాయి. ధోని అవుట్ అయిన తరువాత, భారత్ 9 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి వచ్చింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ భువనేశ్వర్ కుమార్ (0), యుజ్వేంద్ర చాహల్ (5), జస్ప్రీత్ బుమ్రా (0) ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. మొత్తం భారత జట్టు 49.3 ఓవర్‌లో 221 పరుగులు చేసిన తర్వాత భారత్ ఆలౌట్ అయ్యింది. దీనితో 2019 ప్రపంచ కప్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసింది.
భారత జట్టు జెర్సీలో ధోని కనిపించడం ఇదే చివరిసారి. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్ తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం పొందాడు. ఇంక తిరిగి ఆడలేదు.