IPL 2020 KKR vs SRH: హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం

  • Publish Date - September 26, 2020 / 11:40 PM IST

IPL 2020 SRH vs KKR: ఐపిఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13 యొక్క ఎనిమిదో మ్యాచ్‌ ఆడాయి. వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అబుదాబిలోని మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌‌పై 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 142పరుగులు చేసింది. హైదరాబాద్ తరఫున మనీష్ పాండే 51 పరుగులు చేయగా.. ఐపీఎల్ 2020లో పాండే చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది.

తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో పాండే మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే, అతని స్ట్రైక్ రేటు మాత్రం కేవలం 134.21 మాత్రమే. పాండేతో పాటు, ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న వృద్ధిమాన్ సాహా 30 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సాహా 31బంతుల్లో 30పరుగులు చేశాడు.



అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న హైదరాబాద్.. నాల్గవ ఓవర్ చివరి బంతికే జానీ బెయిర్‌స్టో వికెట్ 24 పరుగులు వద్దే కోల్పోయింది. పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో వ్యక్తిగత స్కోరు 5 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీని తరువాత పాండే 51, డేవిడ్ వార్నర్ 36 రెండో వికెట్‌కు 35 పరుగులు పంచుకున్నారు. వార్నర్ 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 36 పరుగులు చేశాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌ బౌలర్లందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలకమైన వార్నర్ వికెట్‌ను వరుణ్ చక్రవర్తి తీశాడు. చక్రవర్తి హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లను తన స్పిన్ బౌలింగ్‌తో కట్టడి చేశాడు. చక్రవర్తి నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆండ్రీ రస్సెల్ మరియు పాట్ కమ్మిన్స్ చెరొక వికెట్ తీశారు.



ఇక ఐపిఎల్ 2020 13వ సీజన్ 8వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి సీజన్‌లో మొదటి విజయం తన ఖాతాలో వేసుకుంది. 143పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 12 బంతులు మిగిలి ఉండగానే.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

కోల్‌కతా విజయానికి యంగ్ బ్యాట్స్‌మన్ సుబ్మాన్ గిల్ కూడా సాయం చేశాడు. 57 బంతుల్లో 66 పరుగులు చేసిన సుబ్మాన్ టార్గెట్‌ని ఈజీ చేశాడు. గిల్ బ్యాట్ నుంచి ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు వచ్చాయి. అంతకుముందు ఓపెనర్ సునీల్ నరైన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. నరైన్‌ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేశాడు. దీని తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ రానా 13 బంతుల్లో 26 పరుగుల చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి ఆరు ఫోర్లు వచ్చాయి. కెప్టెన్ దినేష్ కార్తీక్ మాత్రం సున్నాకి అవుట్ అయ్యాడు.



అనంతరం, సుబ్మాన్ గిల్ మరియు ఇయాన్ మోర్గెన్ ఇన్నింగ్స్‌ను నిర్వహించారు. మోర్గాన్ 24 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ఇక లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ హైదరాబాద్ తరఫున నాలుగు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

అదే సమయంలో ఖలీల్ అహ్మద్, టి నటరాజన్ కూడా ఒక్కొక్క వికెట్ సాధించారు. నటరాజన్ మూడు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చాడు. ఖలీల్ మూడు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు. ఇక సీనియర్ బౌలర్ భువనేశ్వర్ వరుసగా రెండవ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు. మూడు ఓవర్లలో 29పరుగులు సమర్పించుకున్నాడు.