IPL 2024 : ఐపీఎల్‌లో కొత్త నిబంధన..? బ్యాటర్లకు కష్టకాలం మొదలు..! ఫలితాలు తారు మారు..?
టీ20 క్రికెట్ అంటే బ్యాటర్ల గేమ్ అని చెప్పవచ్చు. వైవిధ్యమైన షాట్లు కొడుతూ బౌలర్లకు బ్యాటర్లు పీడకలలు మిగులుస్తున్నారు.

IPL 2024 to introduce new two bouncers per over rule
IPL : టీ20 క్రికెట్ అంటే బ్యాటర్ల గేమ్ అని చెప్పవచ్చు. వైవిధ్యమైన షాట్లు కొడుతూ బౌలర్లకు బ్యాటర్లు పీడకలలు మిగులుస్తున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో ఆఖరి బంతికి తారుమారైన ఫలితాలు ఎన్నో. ఐపీఎల్ 2023 సీజన్‌లో కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ ధయాల్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లోని ఆఖరి ఐదు బంతులను సిక్స్‌లుగా మలిచి తన జట్టుకు నమ్మశక్యంగాని విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో రింకూ సింగ్ హీరోగా మారాడు. అయితే.. యశ్ ధయాల్‌కు దీన్ని నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది.
ఈ క్రమంలోనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్‌లో బ్యాటర్లు, బౌలర్లకు మధ్య సమరం ఉండేలా ఓ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ నిబంధనకు ఐపీఎల్ గౌర్నింగ్ కౌన్సిల్ సైతం ఆమోద ముద్ర వేసింది. ఐపీఎల్ 2024 సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిని బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
MS Dhoni : క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెప్పిన తరువాత.. ధోని ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా..?
కొత్త నిబంధన ఏంటంటే..?
ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లకు వెసులుబాటు కల్పించనుంది. అంటే బౌలర్లు ఓవర్‌లోని ఆరు బంతుల్లో రెండు బంతులను బౌన్సర్లుగా వేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఓవర్‌కు ఒక్క బౌన్సర్ మాత్రమే వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా దేశవాలీ టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీసీసీఐ అమలు చేసింది. కాగా.. ఈ నిబంధన బౌలర్లు ఎంతో ఉపయోగపడనుందని టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు జయదేవ్ ఉన్కదత్ తెలిపాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో ఇది ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.