DC vs KKR : కేకేఆర్ చేతిలో ఓటమి తరువాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కామెంట్స్.. అందుకే ఓడిపోయాం.. అశుతోష్ ఆడుంటే..
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు.

Courtesy BCCI
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై కేకేఆర్ 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది. అంగ్క్రిష్ రఘువంశీ (44; 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూ సింగ్ (36; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టాడరు. చమీరా ఓ వికెట్ సాధించాడు.
అనంతరం డుప్లెసిస్ (62; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (43; 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినా లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టగా అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా చెరో వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తీవ్ర నిరాశకు గురి అయ్యాడు. మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. 15 నుంచి 20 పరుగులు ఎక్కువ ఇచ్చామని చెప్పుకొచ్చాడు. పవర్ ప్లే తరువాత కేకేఆర్ బ్యాటర్లను తాము నియంత్రించామన్నాడు.
ఢిల్లీ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. పలువురు బ్యాటర్లు పరుగులు సాధించలేకపోయినప్పటికి ఇద్దరు ముగ్గురు చాలా బాగా ఆడారని అక్షర్ పటేల్ తెలిపాడు. ఆఖరిలో అశుతోష్ నిలబడి ఉంటే బహుశా తొలి మ్యాచ్‌లాగా అద్భుతాలు జరిగేవన్నాడు. ఇక తన గాయం గురించి మాట్లాడుతూ.. బంతి ఆపేందుకు డైవ్ చేశాను. దీంతో చర్మంపై గాయమైనట్లు చెప్పుకొచ్చాడు. తరువాతి మ్యాచ్‌కు మూడు నుంచి నాలుగు రోజుల విరామం ఉండడం కలిసి వచ్చే అంశం అని ఈలోపు తాను కోలుకుంటానని అక్షర్ పటేల్ తెలిపాడు.