GT vs RR : గుజరాత్ వర్సెస్ రాజస్థాన్.. హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్టు.. ఇంకా..
బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు గుజరాత్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో గెలువగా, ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. 6 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +1.031గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌ను వరుసగా రెండు ఓటములతో మొదలుపెట్టింది. ఆ తరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ జట్టు రన్‌రేట్ -0.185గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఈ క్రమంలో గుజరాత్ పై విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని రాజస్థాన్ ఆరాటపడుతోంది. ఇంకోవైపు విజయపరంపరను కంటిన్యూ చేయాలని గుజరాత్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరా హోరీగా సాగే అవకాశం ఉంది.
పిచ్..
నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ సమతుల్యంగా ఉంటుంది. అటు బౌలర్లకు అటు బ్యాటర్లకు సహకరిస్తూ ఉంటుంది. ఆరంభంలో బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి కుదురుకుంటే బ్యాటర్లు భారీ స్కోరు చేయవచ్చు. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపవచ్చు.
నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ రికార్డు ఇదే..
2022లో అరంగేట్రం చేసినప్పటి నుండి గుజరాత్ టైటాన్స్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 18 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Rishabh Pant – MS Dhoni : మెల్లమెల్లగా ధోనీలా మారుతున్న పంత్.. వాళ్లుండగా.. నేనెందుకు..
నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్ఆర్ రికార్డు..
ఈ స్టేడియంలో ఆర్ఆర్ రెండు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో గెలవగా మరో మ్యాచ్‌లో ఓడిపోయింది.
ముఖాముఖిగా..
రాజస్థాన్, గుజరాత్ జట్లు ముఖాముఖిగా ఆరు సందర్భాల్లో తలపడ్డాయి. ఇందులో 5 మ్కాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే రాజస్థాన్ గెలుపొందింది.