PBKS vs MI : పంజాబ్ వర్సెస్ ముంబై క్వాలిఫయర్ 2 మ్యాచ్.. పిచ్ రిపోర్టు, హెడ్ టు హెడ్ రికార్డులు..
ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపొందాలని ఇరు జట్లు పట్టుదలా ఉన్నాయి.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ పై విజయంతో ముంబై ఉత్సాహంగా ఉండగా, క్వాలిఫయర్ -1లో బెంగళూరు చేతిలో ఘోర ఓటమితో పంజాబ్ డీలా పడింది. అయితే.. ఒక్క ఓటమితో లీగ్ టాపర్ అయిన పంజాబ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. ఈ క్రమంలో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక మ్యాచ్ ఆతిథ్యం ఇచ్చే నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్ ఎలా స్పందించనుంది, ఇరు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
పిచ్ ఎలా స్పందిస్తుందంటే..?
అహ్మదాబాద్ పిచ్ బ్యాటర్లకు అనుకూలం. గత మ్యాచ్‌లో కూడా రెండు జట్లు 200 ఫ్లస్ స్కోర్లను సాధించాయి. ఔట్ ఫీల్డ్ వేగంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.
హెడ్-టు-హెడ్ రికార్డులు..
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు 33 సందర్భాల్లో ముఖాముఖిగా తలడ్డాయి. ఇందులో 15 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెలవగా, ముంబై ఇండియన్స్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకే ఒక మ్యాచ్‌లో తలపడ్డాయి. ఇందులో పంజాబ్ విజయం సాధించడం గమనార్హం.
ఇక అహ్మదాబాద్ స్టేడియంలో పంజాబ్‌కు గొప్ప రికార్డు ఉంది. ఇక్కడ ఆ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక ముంబై కూడా ఈ స్టేడియంలో ఆరు మ్యాచ్‌లు ఆడగా ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.