ఐపీఎల్‌ వాయిదా పడడం వల్ల ఎన్ని వందల కోట్ల నష్టం వస్తుందో తెలుసా?

వారం రోజుల విరామాన్ని పొడిగిస్తే లేదంటే ఈ సీజన్ మొత్తం రద్దయితే నష్టాలు మరింత భారీగా ఉంటాయి.

ఐపీఎల్‌ వాయిదా పడడం వల్ల ఎన్ని వందల కోట్ల నష్టం వస్తుందో తెలుసా?

Pic: @BCCI

Updated On : May 11, 2025 / 9:14 PM IST

భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్‌ 2025ను వారం రోజుల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఈ లీగ్ వాయిదా పడడంతో ఆ బోర్డుకు పెద్ద మొత్తంలో నష్టం వస్తోంది. అయినప్పటికీ దేశ భద్రతే తమకు ముఖ్యమని బీసీసీఐ అంటోంది.

టీవీలతో చేసుకునే ఒప్పందాలు, టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్లు, ఫుడ్ స్టాల్స్ ద్వారా ప్రతి ఐపీఎల్‌ మ్యాచ్‌లో కాసుల వర్షం కురుస్తుంది. ఒక్క మ్యాచు రద్దయితే బీసీసీకి దాదాపు రూ.100 కోట్లు – రూ.125 కోట్ల మధ్య నష్టం వస్తుంది. ఇన్సురెన్స్‌ నుంచి సాయం అందినప్పటికీ బీసీసీఐ ఒక్కో మ్యాచ్‌కి రూ.60 కోట్ల చొప్పున నష్టపోతుంది.

ఈ వారం రోజుల్లో జరగాల్సిన 5-7 మ్యాచులు ఆడకపోతే బీసీసీఐకి రూ.300-420 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇక వారం రోజుల విరామాన్ని పొడిగిస్తే లేదంటే ఈ సీజన్ మొత్తం రద్దయితే నష్టాలు మరింత భారీగా ఉంటాయి.

ప్రస్తుతం వారం రోజుల పాటు వచ్చిన విరామంతో టాటా, జియోహాట్‌స్టార్ వంటి ముఖ్యమైన స్పాన్సర్‌లకు ప్రస్తుతం వచ్చే నష్టం అంతగా లేనప్పటికీ, ఈ వాయిదా చాలా కాలం పాటు కొనసాగితే మాత్రం భారీగా నష్టం వస్తుంది. ఆయా బ్రాడ్‌కాస్టర్లకు యాడ్స్‌ వల్ల వచ్చే దాదాపు రూ.5,500 కోట్లు రాకుండా పోతాయి.

ఐపీఎల్‌ జట్లకూ నష్టమే..
ఐపీఎల్‌ 2025ని చాలా కాలం పాటు వాయిదా వేడయం లేదా రద్దు చేస్తే జట్లు కూడా ఆర్థికంగా నష్టపోతాయి. ఐపీఎల్‌లో ఆడుతున్న 10 జట్లు టీవీ, స్పాన్సర్ల నుంచి వచ్చే ఆదాయంలో ఈ జట్లకు వాటా ఉంటుంది. దీన్నే సెంట్రల్ రెవెన్యూ పూల్ అంటారు. దీంతో, ఐపీఎల్‌ మ్యాచ్‌లను రద్దు చేసినా లేదా చాలా కాలం పాటు ఆలస్యం చేసినా ఈ ఆదాయం తగ్గిపోతుంది.

దీంతో జట్లకు తక్కువ వాటా అందుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి జట్లపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఆయా జట్లకు హోమ్ మ్యాచ్‌ల నుంచి టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రాకుండా పోతుంది. జెర్సీలు, ఇతర సావనీర్ల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు కూడా రాకుండాపోతుంది. దీంతో జట్లు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటాయి.