IPL 2026 : చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఘోర అవమానం..! బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సీఎస్కే.. ‘దోస, ఇడ్లీ, సాంబార్..’
ఐపీఎల్ 2026లో (IPL 2026) చిన్నస్వామి స్టేడియంలో తమకు అవమానం జరిగిందంటూ బీసీసీఐకి చెన్నై సూపర్ కింగ్స్ ఫిర్యాదు చేసింది.
IPL 2026 CSK is unhappy with RCB with the DJ playing the popular Dosa Idli track complete to bcci
- చిన్నస్వామి స్టేడియంలో అవమానం జరిగిందంటూ బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు
- దోస, ఇడ్లీ, సాంబార్ పాట ప్లే చేయడం పై అభ్యంతరం
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఏప్రిల్ 5న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈమ్యాచ్ ఫలితం సంగతి కాస్త పక్కన బెడితే.. తమ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు తమను కించపరిచారని, అవమానకంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీసీసీఐకి చెన్నై సూపర్ కింగ్స్ ఫిర్యాదు చేసింది.
‘దోస, ఇడ్లీ, సాంబార్, చట్నీ, చట్నీ..’ అంటూ సాగే పాటను డీజే ప్లే చేయడం పై సీఎస్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గానా అప్పు కంపోజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాటను ఎక్కువగా మీమ్స్‌లో వాడుతూ ఉంటారు. కొంత మంది ప్రత్యర్థి జట్ల ఫ్యాన్స్ సీఎస్కేను ఉద్దేశించి ట్రోలింగ్ చేయడం కోసం ఈ పాటను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ALSO READ : కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. 100 శాతం ఫిట్‌గా లేను.. అనారోగ్యంతో బాధపడుతున్నా..
ఓ బాధ్యతాయుతమైన ఫ్రాంఛైజీ హోమ్ గ్రౌండ్లో ఈ పాటను డీజే ప్లే చేయడం ఏ మాత్రం సరికాదని సీఎస్కే చెప్పుకొచ్చింది. సీఎస్కే ఫిర్యాదు చేయడాన్ని ఓ ఐపీఎల్ ఉన్నతాధికారి ధ్రువీకరించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ‘మాకు సీఎస్కే నుంచి ఓ ఫిర్యాదు అందింది. మేము దానిని పరిశీలిస్తున్నాము. ‘అని సదరు అధికారి చెప్పినట్లు పేర్కొంది.
మ్యాచ్ సందర్భంగా కొంత మంది సీఎస్కే ఆటగాళ్లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై కూడా బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ తెలిపారు. ‘సాధారణంగా డీజేలు హోమ్ టీమ్‌లను ఉత్సాహపరుస్తూ ఉంటారు. అయితే.. చిన్నస్వామి స్టేడియంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మా ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఈ విషయం పై మేము బీసీసీఐకి లేఖ రాశాము. ‘అని విశ్వనాథన్ అన్నారు.
వాస్తవానికి ఈ వివాదం ఇప్పటిది కాదు. గతేడాది సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో జితేశ్ శర్మ దోస, ఇడ్లీ అంటూ ఈ పాటను పాడుతూ కనిపించాడు. దీనిపై సీఎస్కే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సీఎస్కే యాజమాన్యం రంగంలోకి పరిస్థితి చక్క దిద్దింది. అయితే.. ఇప్పుడు స్టేడియంలోనే పాటను ప్లే చేయడం సీఎస్కే ఆగ్రహానికి కారణమైంది.
