IPL 2026 : మేము ఎలాంటి తప్పు చేయలేదు.. మా ఓటమికి కారణం వీళ్లే.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ యశస్వీ జైస్వాల్ కీలక కామెంట్స్
IPL 2026 : మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ.. తమ ఓటమికి ప్రత్యేక కారణం ఏమీ లేదు.. కానీ, ఈ మ్యాచ్ తమకు ఓ గుణపాఠమని తెలిపాడు.
Rajasthan Royals captain Yashasvi Jaiswal
- ఆర్ఆర్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విజయం
- 77 పరుగుల తేడాతో విజయం సాధించిన జీటీ
- ఓటమిపై ఆర్ఆర్ కెప్టెన్ జైస్వాల్ కీలక కామెంట్స్
IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (44బంతుల్లో84), సాయి సుదర్శన్ (36బంతుల్లో 55) రాణించారు. చివరిలో వాషింగ్టన్ సుందర్ (37నాటౌట్) చెలరేగడంతో గుజరాత్ నాలుగు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 16.3 ఓవర్లలోనే కేవలం 152 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఘన విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ యశస్వీ జైస్వాల్ మాట్లాడుతూ.. తమ ఓటమికి ప్రత్యేక కారణం ఏమీ లేదు.. కానీ, ఈ మ్యాచ్ తమకు ఓ గుణపాఠమని తెలిపాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మేము వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించా.. కానీ, విఫలం అయ్యాం.
మేము మ్యాచ్‌లో ఎలాంటి తప్పలు చేయలేదు. మంచి ఏరియాల్లో బౌలింగ్ చేయడంతోపాటు బౌండరీలను అడ్డుకునే ప్రయత్నం చేశాం. కానీ, వారు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈరోజు జోఫ్రా ఆర్చర్‌కు కలిసిరాలేదు. క్రికెట్లో ఇది సహజమే. కానీ, ఆర్చర్ మాకోసం అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను మళ్లీ బలంగా పుంజుకుంటాడని నమ్మకం నాకుంది. బట్లర్‌ను పక్కన పెట్టడం మా విజయావకాశాలను దెబ్బతీసిందా అంటే..? నేను అంతగా ఆలోచించలేదు అంటూ జైస్వాల్ సమాధానం ఇచ్చారు.
మైదానంలోకి దిగిన తరువాత నా ప్రధాన దృష్టి నా బౌలర్ ఎవరు..? పవర్ ప్లేలో నాకు మంచి ఓవర్లు ఎవరు వేయగలరు..? అనే దానిపై మాత్రమే దృష్టి పెట్టాను. అంతకు మించి ఏం లేదు.ఈ మ్యాచ్ నుంచి నేర్చుకొని తదుపరి మ్యాచ్ కోసం మేము ఏమి చేయగలం అనే దానిపై దృష్టి సారిస్తాం అంటూ యశస్వీ జైస్వాల్ చెప్పుకొచ్చాడు.
