Washington Sundar : వాషింగ్టన్ సుందర్ ఎంత పని జేస్తివి.. డకౌట్ కావాల్సినోడిని హీరోని చేస్తివిగా..
చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్‌ను వాష్టింగ్టన్ సుందర్ (Washington Sundar )మిస్ చేశాడు.
IPL 2026 Washington Sundar miss catch of virat kohli big loss to gt
- విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ చేసిన వాషింగ్టన్ సుందర్
- భారీ మూల్యం చెల్లించుకున్న గుజరాత్
- 81 పరుగులతో ఆర్సీబీ విజయంలో కోహ్లీ కీలక పాత్ర
Washington Sundar : క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి క్రికెట్లో బాగా ప్రసిద్ధి. అంటే క్యాచ్‌లు పడితే మ్యాచ్‌ల్లో విజయం సాధించవచ్చు. అదే ఒక్క క్యాచ్ మిస్ చేసినా కూడా అది మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుంది. తాజాగా అలాంటి ఓ ఘటన జరిగింది. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఓ క్యాచ్ ను మిస్ చేశాడు. ఇక చెప్పేది ఏముంది ఇందుకు గుజరాత్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందే?
శుక్రవారం చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ (58 బంతుల్లో 100) సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆర్సీబీ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను మహ్మద్ సిరాజ్ వేశాడు. ఈ ఓవర్లోని మూడో బంతికి కోహ్లీ మిడ్ వికెట్ దిశగా సింపుల్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ ఈజీగా క్యాచ్ అందుకుంటాడని అంతా భావించారు. అయితే.. సుందర్ క్యాచ్‌ను మిస్ చేశాడు. అప్పటికి కోహ్లీ ఖాతాను కూడా తెరవలేదు.
ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ మరోసారి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు దేవ్దత పడిక్కల్ (27 బంతుల్లో 55 పరుగులు) చేయడంతో ఆర్సీబీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఇక ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఒకవేళ వాషింగ్టన్ సుందర్ గనుక కోహ్లీ క్యాచ్ పట్టి ఉంటే.. పరిస్థితి మరో రకంగా ఉండేదని గుజరాత్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
