IPL 2025: ఐపీఎల్ టోర్నీ వాయిదాతో.. డబ్బులు వెనక్కిచ్చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సహా పలు ప్రాంచైజీలు..

ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మే8న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 59వ మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది.

Courtesy BCCI

IPL 2025: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టోర్నీని వారంరోజులపాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మే8న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 59వ మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం రాత్రి పఠాన్‌కోట్ నగరంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు యత్నించింది. దీంతో సైరన్‌లు మోగడంతో మధ్యలోనే అర్ధంతరంగా మ్యాచ్ ను నిలిపివేశారు. మరుసటిరోజే బీసీసీఐ ఐపీఎల్ ను వారం రోజులు వాయిదా వేసింది.

Also Read: Virat Kohli : టెస్ట్ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..? బీసీసీఐకి సమాచారం.. ఇంగ్లాండ్ టూర్‌కు ముందే ప్రకటించే చాన్స్

బీసీసీఐ నిర్ణయం తరువాత ప్రాంచైజీలు మిగిలిన మ్యాచ్ లకు టికెట్ రీఫండ్ లను చేయడంపై దృష్టిపెట్టాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు శనివారం తన సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగే మ్యాచ్ కు సంబంధించిన టికెట్లకు రీఫండ్ లను త్వరలోనే ప్రారంభిస్తామని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది.


లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కూడా టికెట్ల రీఫండ్ పై ప్రకటన చేసింది. మే9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరగాల్సిన మ్యాచ్ కు సంబంధించిన టికెట్లకు రీఫండ్ వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. ‘‘ఎకానా క్రికెట్ స్టేడియంలో 9వ తేదీ రాత్రి జరగాల్సిన మ్యాచ్ రద్దు చేయబడింది. టికెట్ రీఫండ్ లకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాము’’ అని ఫ్రాంచైజీ పోస్టు చేసింది.

ఐపీఎల్ టోర్నీని మరో వారంరోజుల్లో పున:ప్రారంభిస్తామని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల ముధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పట్లో టోర్నీ పున: ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు.