IPL2023: ఫైనల్‌కు చేరేది ఎవరు..? ధోని సేనకు కష్టమేనా..? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా..
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings,) జట్లు తొలి క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి.

Qualifier 1 GT vs CSK (photo @IPL)
CSK vs GT: ఐపీఎల్ (IPL) 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. టైటిల్ కోసం మొత్తం 10 జట్లు పోటీ పడగా ప్రస్తుతం నాలుగు జట్లు రేసులో ఉన్నాయి. ఈ రోజు నుంచి ప్లే ఆఫ్స్‌కు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings,) జట్లు తొలి క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా మ్యాచ్ జరగనుండడం ధోని సేనకు కలిసివచ్చే అంశం.
అయితే.. గుజరాత్ టైటాన్స్ ను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఓడించలేదు. ఇది గుజరాత్‌కు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరా హోరీగా జరిగే అవకాశం ఉంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లనుండడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. కాగా.. ఓడిన జట్టుకు మరో ప్రయత్నంగా రెండో క్వాలిఫయర్ ఆడి ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది.
టాప్ ఫామ్‌లో చెన్నై ఓపెనర్లు
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వేలు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరితో పాటు రహానే, శివమ్ దూబేలు కూడా దంచికొడుతుండడంతో ధోని, జడేజాలకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. అంబటి రాయుడు ఫామ్ ఒక్కటే ప్రస్తుతం చెన్నైను కలవరపెట్టే అంశం. అతడు కూడా రాణిస్తే మరోసారి భారీ స్కోరు సాధించడం చెన్నైకు పెద్ద కష్టమైన పని కాదు. యువ ఆటగాళ్లతో కూడిన బౌలింగ్ దళం కూడా చక్కగా రాణిస్తోంది. తుపార్ దేశ్ పాండే, దీపక్ చాహర్‌లు పవర్ ప్లేలో పరుగులు ఇస్తున్నప్పటికీ వికెట్లు పడగొడుతున్నారు. మహేశ్ తీక్షణ, మహేశ్ పతిరణల వైవిధ్యమైన బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లను ఎంత వరకు అడ్డుకుంటారో చూడాల్సిందే.
జోరు కొనసాగించాలని
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే చెన్నై పై ఘన విజయాన్ని సాధించింది గుజరాత్ టైటాన్స్. ఇప్పటి వరకు చెన్నైపై ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గుజరాత్ గెలిచింది. ఇక చివరి మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోరు చేసినా ఛేదించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేదే. శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. సాహా, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ధసున్ శనక, రషీద్ ఖాన్‌లతో కూడిన భీకర బ్యాటింగ్ లైనప్ గుజరాత్ సొంతం. వీరిని ఆపడం ప్రత్యర్థి బౌలర్లకు కత్తిమీద సాములాంటిదే. అటు మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్‌లతో కూడిన బౌలింగ్ విభాగం ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేస్తున్నారు.
IPL Playoffs: 10లో 4 మిగిలాయ్.. ప్లే ఆఫ్స్ ఇలా.. ఐపీఎల్ విజేత ఎవరో..?
పిచ్..
సాధారణంగా చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలం. మ్యాచ్ జరుగుతున్న కొద్ది మంచు ప్రభావంతో బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.
తుది జట్ల అంచనా
గుజరాత్ టైటాన్స్ : శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, దసున్ షనక, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ