Jasprit Bumrah : బుమ్రా వల్లే సన్‌రైజర్స్ పై ముంబై ఓడిపోయిందా.. బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ కామెంట్స్ వైరల్..
అంతర్జాయ క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా మరేదైన మ్యాచ్ కానివ్వండి జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఉన్నాడు అంటే అభిమానులకు అదో భరోసా.
Kieron Pollard comments on Jasprit Bumrah current form in IPL 2026 (pic credit@ipl)
- సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఓడిపోయిన ముంబై
- ధారాళంగా పరుగులు ఇచ్చిన బుమ్రా
- 4 ఓవర్లలో ఏకంగా 54 రన్స్
Jasprit Bumrah : అంతర్జాయ క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా మరేదైన మ్యాచ్ కానివ్వండి జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు అంటే అభిమానులకు అదో భరోసా. పిచ్ ఎంతగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికి, మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నప్పటికి కూడా బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్ల మీద వికెట్లు తీస్తూ మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు ఎన్నో. అయితే.. ఈ ఐపీఎల్ సీజన్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా బుమ్రా ఘోరంగా విఫలం అవుతున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా 180 బంతులు విసిరాడు. 8.8 ఎకానమీతో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 2015 తరువాత బుమ్రా ఎకానమీ రేటు ఓవర్‌కు ఎనిమిది పరుగులు దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బుమ్రా వికెట్లు తీయకపోవడం ముంబై ఇండియన్స్‌ను ఘోరంగా దెబ్బతీస్తుంది.
కాగా.. బుధవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లలో 13.50 ఎకామీతో 54 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా విఫలం అవుతుండడంపై మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో కీరన్ పొలార్డ్ మాట్లాడాడు.
ఒక క్రికెటర్ సరిగ్గా ఆడనప్పుడు, అతను ఎందుకు రాణించలేకపోతున్నాడోనని ప్రతి అంశాన్ని పరిశీలిస్తాం. బుమ్రా విషయంలో కూడా అదే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా అతడు అద్భుతంగా రాణించాడు. అతడేమీ యంత్రం కాదు. ఓ మనిషిగా తప్పులు చేయడం సహజం. ప్రస్తుతం అతడు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. మనం వర్తమానంలో జీవించడానికి ప్రయత్నిస్తాం. అతడు ఆశించిన స్థాయిలో రాణించకపోయినప్పటికి కూడా ఇన్నాళ్లుగా అతడు ముంబై ఇండియన్స్‌కు, భారత్‌కు నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడు త్వరలోనే లయను అందుకుంటాడు అని పొలార్డ్ అన్నాడు.
ఈ సీజన్లో ముంబై ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీనిపై మాట్లాడుతూ.. తాము ఇంకా ఓటమిని అంగీకరించలేదన్నాడు. ఈ సీజన్లో తాము ఇంకా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించలేదన్నాడు. ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, వాటిలో గెలిచిందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నాడు.
