IPL 2023, KKR vs SRH: ఎవరి జోరు కొనసాగేనో..?
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders)తో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad,)తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది

KKR vs SRH
IPL 2023, KKR vs SRH: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders)తో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad,)తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి విజయపరంపరను కొనసాగించాలని ఇరు జట్లు భావిస్తుండడంతో మ్యాచ్ హోరా హోరీగా జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో కోల్‌కతా మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ కూడా మూడు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌లో ఓడిపోగా ఆఖరి మ్యాచ్‌లో గెలుపొంది పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
బ్యాటింగ్ గాడిన పడితేనే
వరుసగా రెండు పరాజయాలతో ఈ సీజన్ ఆరంభించిన సన్‌రైజర్స్ ఎట్టకేలకు ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు రుచి చూసింది. అదే ఊపును నేటి మ్యాచులోనూ కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్ లు రాణిస్తున్నారు. వీరితో పాటు మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ లు తమ స్థాయికి తగినట్లు రాణిస్తే సన్ రైజర్స్‌కు తిరుగులేదు. సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. బౌలింగ్ దళానికి భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహిస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, వాషింగ్టన్ సుందర్‌లతో కూడిన లైనప్ ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెడుతోంది.
ఆల్‌రౌండ్ షో
వరుసగా రెండు విజయాలతో కోల్‌కతా జోష్‌లో ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆఖరి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై అతడు విరుచుకుపడే అవకాశం ఉంది. కెప్టెన్ నితీశ్ రాణాతో పాటు వెంకటేశ్ అయ్యర్‌లు ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటుతున్నాడు. వీరితో పాటు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లు రాణిస్తే సన్ రైజర్స్ బౌలర్లకు కష్టాలు తప్పవు. కాగా.. రెండు జట్లు తమ ఆఖరి మ్యాచుల్లో విజయం సాధించడంతో తుది జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.
కేకేఆర్ దే పై చేయి
ఇరుజట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా తలపడిన మ్యాచ్‌ల్లో కోల్‌కతా 15 మ్యాచుల్లో విజయం సాధించగా, 8 మ్యాచుల్లో సన్‌రైజర్స్ గెలుపొందింది. మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్‌లో ఇరు జట్లు 8 మ్యాచులు ఆడగా ఆరింటిలో కేకేఆర్ గెలిచింది.
తుది జట్లు(అంచనా) :
కోల్‌కతా : రహ్మానుల్లా గుర్బాజ్, ఎన్.జగదీషన్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, లాకీ ఫర్గుమ్సన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
హైదరాబాద్ : మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్/ టి నటరాజన్