Champions Trophy: కోహ్లీ, రోహిత్, జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్ అవుతారు.. ఎందుకో చెప్పిన ఆకాశ్‌ చోప్రా

భారమైన హృదయంతో ఈ మాట చెబుతున్నానని అన్నారు.

Champions Trophy: కోహ్లీ, రోహిత్, జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్ అవుతారు.. ఎందుకో చెప్పిన ఆకాశ్‌ చోప్రా

Updated On : February 16, 2025 / 12:54 PM IST

ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 19 నుంచి జరగనున్న ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మెరుపులు మెరిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే, వారి మెరుపులను చూడడానికి ఛాంపియన్స్‌ ట్రోఫీనే చివరి అవకాశమా? టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా అవునని అంటున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్డ్ అవుతారని ఆయన చెబుతున్నారు.

తాజాగా, ఆయన తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ.. భారమైన హృదయంతో ఈ మాట చెబుతున్నానని, రోహిత్‌తో పాటు విరాట కోహ్లీ, రవీంద్ర జడేజాకు ఆఖరి ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీనే అవుతుందని అన్నారు.

 Also Read: SIP చేస్తున్నారా? చేద్దామనుకుంటున్నారా? ఎంతకాలం చేయాలో తెలుసుకోండి..!

ఈ టోర్నమెంట్‌ అనంతరం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంటుందని, అయితే, ఫైనల్‌లో ఆడేందుకు మన జట్టు అర్హత సాధించలేదని ఆకాశ్ చోప్రా గుర్తుచేశారు. అలాగే, 2026 టీ20 ప్రపంచ కప్‌కు రోహిత్, విరాట్ కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ ప్రకటన చేయడంతో దానిలో ఆడే ఛాన్స్‌ లేదని అన్నారు.

ఇక 2027 వన్డే ప్రపంచ కప్‌కు బోలెడు టైమ్‌ ఉందని ఆకాశ్ చోప్రా తెలిపారు. ఆ సమయం నాటికి పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రావచ్చని చెప్పారు. ఆ సమయం వచ్చేవరకు రోహిత్, కోహ్లీ, జడేజా జట్టులో ఉండడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.

దీంతో వీరికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అని తాను అనుకుంటున్నట్లు ఆకాశ్ చోప్రా చెప్పారు. అయితే, వారు ముగ్గురు ఫిట్‌గా ఉంటూ ఫామ్‌ కొనసాగిస్తే, వారికి నచ్చినంత కాలం ఆడాలని బలంగా అనుకుంటే మాత్రం వారిని ఆపేవారే ఉండరని కూడా అన్నారు. ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచుతో ఈ నెల 19న ప్రారంభం కానుంది.