Kona Srikar Bharat: తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఎలా ఆడాడంటే..

Kona Srikar Bharat: కెరీర్ లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ బ్యాటింగ్ లో ఆకట్టుకోలేకపోయాడు.

Kona Srikar Bharat: తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఎలా ఆడాడంటే..

Updated On : February 10, 2023 / 4:28 PM IST

Kona Srikar Bharat: కెరీర్ లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ బ్యాటింగ్ లో ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ దిగిన శ్రీకర్ 8 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్ లో ఎల్బీగా అవుటయ్యాడు. 10 బంతులను ఎదుర్కొన్న మన తెలుగు అబ్బాయి ఒక ఫోర్ కూడా కొట్టాడు. అయితే ఎక్కువసేపు క్రీజ్ లో నిలదొక్కుకోలేక స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు.

వికెట్ కీపింగ్ లో మాత్రం శ్రీకర్ ఆకట్టుకున్నాడు. ప్రపంచ నంబర్ టెస్ట్ బ్యాట్స్ మన్ మార్నస్ లబుషేన్ ను రవీంద్ర జడేజా బౌలింగ్ లో స్టంప్ అవుట్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్ లోనూ ఇదే ఊపు కొనసాగించాలని భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. బ్యాటింగ్ లో కూడా రాణించి జాతీయ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని అతడి తల్లిదండ్రులతో పాటు తెలుగు క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఆలస్యంగా వచ్చినప్పటికీ అతడు సత్తా చాటతాడని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై ఆస్పత్రిపాలవడంతో శ్రీకర్ భరత్ కు ప్రతిష్టాత్మక బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కింది. సీనియర్ బ్యాట్స్ మన్ ఛతేశ్వర్ పుజారా చేతుల మీదుగా టెస్ట్ జట్టు క్యాప్ అందుకున్నాడు. తనకు తుది జట్టులో స్థానం దక్కిందన్న విషయం తెలియగానే తల్లిని హత్తుకుని ఉద్వేగానికి గురయ్యాడు శ్రీకర్. టీమిండియా తరపున ఆడే అవకాశం రావడం పట్ల పట్టరాని సంతోషం వ్యక్తం చేశాడు.

Also Read: రోహిత్ శర్మ సెంచరీ బాదుడు.. మరో రికార్డు కొట్టేశాడుగా

దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన 29 ఏళ్ల కోన శ్రీకర్ భరత్.. 2012, ఫిబ్రవరి 20న బెంగళూరులో ఆంధ్ర, తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో లిస్ట్ ఏలో అరంగ్రేటం చేశాడు. ఇప్పటిరకు 64 లిస్ట్ ఏ మ్యాచులు ఆడి 1950 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 161. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.